నందిగాం: మండలంలోని హరిదాసుపురం గ్రామానికి చెందిన అక్కురాడ ఢిల్లేంద్ర(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందిగాం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కురాడ కరువులుకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ఢిల్లేంద్ర జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుశీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న తమ్ముడు భుజంగరావును ష్యూరిటీగా పెట్టి భార్య సుశీల పేరిట రూ.3 లక్షల లోన్ తీసుకున్నాడు. కొద్ది రోజులుగా లోన్ డబ్బులు కట్టకపోవడంతో కుటుంబంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య సుశీల సారవకోట మండలం కుమ్మరిగుంటలో ఉన్న కన్నవారింటికి వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఢిల్లేంద్ర శుక్రవారం ఉదయం టెక్కలి వెళ్లాడు. అటు నుంచి బస్సులో బెండిగేటు వరకు టికెట్ తీసుకొని తురకల కోట వద్ద దిగాడు. అక్కడినుంచి మాదిగాపురం సమీపంలో ఉన్న తమ జీడి తోటకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఘటనా స్థలంలో హిట్ దోమల కాయిల్స్, మద్యం బాటిల్ ఉండటంతో మందులో కాయిల్స్ కలిపి తాగి ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడి తమ్ముడు తోటలో జీడి పిక్కలు ఏరేందుకు వెళ్లగా అక్కడ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలియజేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.