జయపురం: ఒకే చోట మూడు బైక్‌లు ప్రమాదానికి గురి కాగా ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారునితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన మహిళ జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి పల్లి గ్రామం లలిత గౌఢ (60) కాగా గాయపడిన వారిలో ఆమె కుమారుడు హిరణ్య గౌఢ(27), బొరిగుమ్మ పోలీసు స్టేషన్ పరిధిలోగల ఖెందుగుడ గ్రామ దంపతులు ప్రభాకర పాత్రో (45) అతడి భార్య సేవిక పాత్రో, అలాగనే జయపురం సమితి మూలసొర గ్రామం రవీంధ్ర తంతి(24) ఉన్నట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హిరణ్య గౌడను కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించామని, మిగతా ముగ్గురిని జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. లలిత ఆమె కుమారుడు హిరణ్యలు బైక్‌పై బొరిగుమ్మ వెళ్తుండగా ప్రభాకర పాత్రో దంపతులు బైక్‌పై జయపురం వస్తున్నారు. 26 వ జాతీయ రహదారి రొండాపల్లి గ్రామం రేడియో స్టేషన్ కూడలి వద్ద ఆ రెండు బైక్‌లు ముఖాముఖి ఢీకొన్నాయి. అదే సమయంలో జయపురం సమితి మూలసర గ్రామం నుంచి రవీంద్ర మరో బైక్‌పై వస్తుండగా అదే స్థలంలో అతడి బైక్ కూడా ప్రమాదానికి గురైంది. అతడు చిన్న దెబ్బలతో బయట పడ్డాడు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అంబాగుడ పోలీసు పటి పోలీసు అధికారి మనువ బిడిక పోలీసులతో సంఘటన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమం చేపట్టారు. స్థానికుల సహకారంతో గాయపడిన వారందరినీ ఆస్పత్రికి పంపారు. సమాచారం అందుకున్న సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రదాన్ అక్కడకు చేరుకున్నారు. చికిత్స చేస్తున్న సమయంలో లలిత మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. హిరణ్య గౌడ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం అతడిని కొరాపుట్ తరలించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.