గజపతినగరం: మెంటాడ మండలం రెల్లిపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు రాళ్లపూడి అంకమ్మను(75) హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం గజపతినగరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మెంటాడ మండలం రెల్లిపేటలో తన నివాస గృహంలో 16.3,2025న వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామన్నారు. శవపంచనామా అనంతరం వృద్ధురాలిని గొంతునులిమి చంపినట్లు వైద్యుల రిపోర్టు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులను గాలించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గురువారం ఉదయం 11గంటలకు నలుగురు నిందితులైన దానాలరాము, దానాల దుర్గారావు, దానాల రాములమ్మ, పాల్తేటి రామప్పడు అలియాస్ బొడ్డులు పంచాయతీ సెక్రటరీ, వీఆర్‌ఓల సమక్షంలో లొంగిపోయినట్లు చెప్పారు. మృతురాలు అంకమ్మ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి నగదు అప్పుగా ఇస్తూ ఉంటుందని అందులో భాగంగా దానాల రాములమ్మ అప్పుఅడగ్గా ఆమె తిరస్కరించింది. దీంతో రాములమ్మతో పాటు మరో ముగ్గురు తోడై వృద్ధురాలి వద్ద ఉన్న బంగారం ముక్కుపుడక, రూ.740లు దోచుకుని ఆమెను హతమార్చినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన స్థానిక సీఐ జీఏవీ రమణ, ఆండ్ర ఎస్సై కె.సీతారామ్, గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావులతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్‌తో పాటు తాను అభినందిస్తున్నట్లు చెప్పారు.
వృద్ధురాలిని హతమార్చిన కేసులో నలుగురి అరెస్ట్