విజయనగరం గంటస్తంభం: జిల్లాలో అవసరం ఉన్న చోట బడిబస్సులు ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు జి.సూరిబాబు, కె.రాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు బడి బస్సుల కోసం ఇబ్బంది పడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా బడి బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. గతంలో లాగా విజయనగరం నుంచి రణస్థలం వరకు, విజయనగరం నుంచి సతివాడ, విజయనగరం నుంచి కుమిలి వరకు బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలు కావస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికై నా బడి బస్సుల సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శులు శిరీష, సోమేష్, పట్టణ కమిటీ సభ్యులు శివ, గుణ, జయ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.