భువనేశ్వర్: దివంగత రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నవకిషోర్ దాస్ హత్యా సంఘటనపై సీబీఐ దర్యాప్తు చర్చకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అనుమతించారు. మంత్రి కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక లోక్‌సేవా భవన్‌లో సీఎంను కలిశారు. నవకిషోర్‌దాస్ భార్య మీనతిదాస్ లిఖితపూర్వక అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఈ అనుమతి జారీ చేశారు.
క్రైంశాఖ పునఃదర్యాప్తు..
బుధవారం రెండో రోజు క్రైంశాఖ పునఃదర్యాప్తు నిరవధికంగా కొనసాగింది. ఇద్దరు క్రైమ్‌శాఖ దర్యాప్తు బృందం దివంగత మంత్రి ఇంటికి చేరుకుని కుటుంబీకులను ప్రశ్నించింది.వారి వాంగ్మూలం నమోదు చేసినట్లు క్రైమ్ శాఖ అధికారి తెలిపారు. రెండో రోజున హత్య తదనంతర తక్షణ కార్యాచరణపై దర్యాప్తు బృందం లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించి అక్కడ నుంచి ఎయిర్ అంబులెన్సులో రవాణా తదితర అనుబంధ కార్యాచరణపై దర్యాప్తు చేపట్టారు.
సీబీఐ దర్యాప్తు కోసం ఒత్తిడి తెస్తా: జయ నారాయణ మిశ్రా
నవ కిషోర్ దాస్ హత్యా సంఘటనపై సీబీఐ దర్యాప్తు కోసం అభ్యర్థిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే మిశ్రా తెలిపారు. దివంగత మంత్రి కుటుంబీకులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి అనుతించిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోసం అభ్యర్థిస్తే తన వంతుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సీబీఐ దర్యాప్తు కోసం ఒత్తిడి చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో జాప్యం చోటు చేసుకుందని చెప్పారు.
లిఖితపూర్వక అభ్యర్థన అవాంఛనీయం: బీజేడీ
నవ కిషోర్ హత్య సంఘటనపై సీబీఐ దర్యాప్తు కోసం కుటుంబీకుల నుంచి లిఖితపూర్వక అభ్యర్థన అవాంఛనీయమని ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ నాయకుడు డాక్టరు ప్రసన్న కుమార్ ఆచార్య విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు దివంగత మంత్రి కుటుంబీకులకు సీబీఐ విచారణకు పదే పదే లేఖలు రాయమని ఎందుకు అడుగుతున్నారు? అని నిలదీశారు. సీబీఐ విచారణకు ఎలాంటి లిఖితపూర్వక అభ్యర్థన అవసరం లేదని స్పష్టం చేశారు.
దొందూదొందే: కాంగ్రెసు
దివంగత మంత్రి హత్య ఘటన విచారణ, దర్యాప్తు వ్యవహారంలో ఉభయ బిజూ జనతా దళ్, భారతీయ జనతా పార్టీ దొందూ దొందే అన్నట్లు కాలక్షేపం చేస్తున్నాయని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ వ్యాఖ్యానించారు.
సీఎంను కలిసిన మాజీ మంత్రి కుటుంబీకులు
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని దివంగత మంత్రి నవ కిషోర్ దాస్ కుటుంబ సభ్యులు బుధవారం కలిశారు. సీబీఐ విచారణ కోసం అభ్యర్థన లేఖను సమర్పించారు.