పిచ్చుకలను పరిరక్షించుకుందాం

చైతన్య ర్యాలీ నిర్వహిస్తున్న అంచలిక వికాశ్‌ 
పరిషత్‌ సభ్యులు, విద్యార్థులు 
 - Sakshi

● డీఎఫ్‌ఓ రవీంద్రకుమార్‌ మిశ్రా పిలుపు

బరంపురం:

వివిధ కారణాలతో అంతరిస్తున్న పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గంజాం జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రకుమార్‌ మిశ్రా కోరారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో అంచలిక వికాశ్‌ పరిషత్‌ సహకారంతో నగర శివారులోని గుండలా గ్రామంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పిచ్చుకలు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అధిక రేడియేషన్‌, కాలుష్యమే దీనికి కారణమని అభిప్రాయం వ్యక్తంచేశారు. గతంలో ఇళ్లల్లో పిచ్చుకలు స్వయంగా గూడు కట్టుకొని నివసించేవని, ఇప్పుడా పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించే పిట్టలను కాపాడుకుంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు. దీనికి అనుగుణంగా కృత్రియ గూళ్లను ఇళ్ల వద్ద ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా ఈ ఏడాది జిల్లాలోని 450 పాఠశాలల్లో చెక్కతో తయారు చేసిన గూళ్లను పంపిణీ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ అధికారులు, విద్యార్థులు గ్రామంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు.

చెక్కతో పిచ్చుకలు..

బరంపురం: నగరంలోని నీలకంఠనగర్‌ 3వ లైన్‌కు చెందిన సైకతశిల్పి సత్యనారాయణ మహరాణ తన కళా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. సోమవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా చెక్కతో పిచ్చుక బొమ్మలను తయారు చేశారు. పిచ్చుకలను రక్షించుకుందామని చైతన్యపరస్తూ సందేశానిచ్చారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top