మైలవరం: మైలవరంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర గళ భగవద్గీత పారాయణ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. శ్రీ గణపతి సచ్ఛిదానందస్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ద్వారకా తిరుమల దేవస్థానాల చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ప్రోత్సాహంతో కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు వి.బాలాజీ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి 800 మంది పారాయణ సభ్యులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల దేవస్థానాల వంశపారంపర్య ధర్మకర్త ఎస్వీ నివృతరావు ఆధ్వర్యంలో పాల్గొన్న వారందరికీ అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మైలవరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బయన శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ సభ్యులు జాస్తి వెంకటేశ్వరరావు, అలమూరు చంద్రశేఖరరావు, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక వినాయకుని దేవాలయం నుంచి శోభాయాత్ర జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వైద్య కళాశాలకు ఐద్వా నేత మృతదేహం దానం
తిరువూరు: అనారోగ్యంతో మృతిచెందిన మహిళా సంఘ నాయకురాలు మేకల రవికుమారి(56) మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు శనివారం మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ వైద్యకళాశాలకు దానమిచ్చారు. ఈ మేరకు ఆమె భర్త, సీనియర్ న్యాయవాది, సీపీఎం పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్రప్రసాద్ సమ్మతితో వైద్యులు రవికుమారి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు, సీపీఎం రాష్ట్ర నాయకులు బీఆర్ తులసీరావు, స్థానిక నాయకులు రవికుమారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరువూరు కోర్టు న్యాయమూర్తి సింధూర, పలువురు న్యాయవాదులు రవికుమారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


