ఆరు వేల కోసం నిండు ప్రాణం బలి | - | Sakshi
Sakshi News home page

ఆరు వేల కోసం నిండు ప్రాణం బలి

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

కంచికచర్ల: మండలంలోని పరిటాల సమీపంలో హెచ్‌పీ పెట్రోలు బంక్‌లో చోటు చేసుకున్న దోపిడీ, బంక్‌ ఉద్యోగి ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామానికి చెందిన సయ్యద్‌ ఆరీఫ్‌(30) హత్యకు కారణమైన ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కంచికచర్ల రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం విజయవాడ రూరల్‌ డీసీపీ బి. లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావు, రూరల్‌ సర్కిల్‌ సీఐ వైవీఎల్‌ నాయుడుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.

ఏం జరిగిందంటే..

మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామంలో ఓ వ్యక్తి తన కారును ఇంటి ముందు ఉంచి రాత్రి సమయంలో నిద్రపోయాడు. ఆ కారు నంబర్‌ను తీసుకున్న నిందితులు.. వారు ఉపయోగించిన కారుకు దానిని పెట్టుకొని కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని హెచ్‌పీ పెట్రోలు బంకుకు వచ్చారు. తమకు అత్యవసరంగా నగదు అవసరం ఉందని, ఫోన్‌పే చేస్తాం డబ్బులు కావాలని ప్రాథేయపడటంతో బంకులో పనిచేసే ఆరీఫ్‌(30) నగదును లెక్కిస్తుండగా.. ఆ నగదును లాక్కొని కారు వేగంగా పోనిచ్చారు. కారును ఆపే ప్రయత్నం చేసిన ఆరిఫ్‌.. ఈక్రమంలో రోడ్డుపై పడిపోవడం.. కారు అతనిని 150 మీటర్ల వరకు లాక్కెళ్లటంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.

48 గంటల్లోనే..

ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన కంచికచర్ల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేపట్టారు. నాలుగు ప్రత్యేక బందాలుగా ఏర్పడి, సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో 48 గంటల్లోనే కేసును ఛేదించారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ అండర్‌ పాస్‌ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పీఓఎస్‌ మిషన్‌తో పాటు దోపిడీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు వీరే..

నిందితుల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి క్రిస్టియన్‌పేటకు చెందిన గుజ్జర్లపూడి మహేష్‌(గతంలో గొర్రెల దొంగతనంపై మూడు కేసులున్నాయి), నరసారావుపేటకు చెందిన చుండి మనోజ్‌కుమార్‌, కామసాని ఆదిత్య, కూడిపూడి అరవింద్‌, పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన మంద రోహిత్‌, సత్తెనపల్లికి చెందిన మైనర్‌ బాలుడు(ఈ మైనర్‌పై గొర్రెల దొంగతనంపై మూడు కేసులున్నాయి)లను అదుపులోకి తీసుకొని విలేకరుల ఎదుట హాజరు పర్చారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన రూరల్‌ సీఐ వైవీఎల్‌నాయుడు, కంచికచర్ల ఎస్‌ఐలు పి. విశ్వనాథ్‌, జి. నానినరేందర్‌, వీరులపాడు ఎస్‌ఐ అభిమన్యు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన డీసీపీ, నగదు రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement