కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని వీఎంసీ కార్యాలయం సమీపంలో పుట్‌ఫాత్‌పై అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభించిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వీఎంసీ కటింగ్ వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై గురువారం ఉదయం సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన ఒక మగ వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని వద్ద పేరు, ఊరుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుని ఎడమ చేతిపై దుర్గమ్మ అని, కుడి మోచేతిపై అంజి అని, కుడిచేతి మడమపై డి లవ్ సింబల్‌తో పచ్చ బొట్లు ఉన్నాయని చెప్పారు. అలాగే ఎడమవైపు బొడ్డు కింద, కుడివైపు నాభి కింద, ఎడమ మోచేతిపై పుట్టుమచ్చలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


