అంతకంతకూ ఆలస్యం! | - | Sakshi
Sakshi News home page

అంతకంతకూ ఆలస్యం!

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

డిగ్రీ అడ్మిషన్లపై ఎడతెగని జాప్యం

అవకాశాలు కోల్పోతున్న విద్యార్థులు..

ఇంటర్‌ ఫలితాలు వచ్చి నాలుగు నెలలైనా రాని నోటిఫికేషన్‌

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌తో ముడిపెడుతున్న వైనం

డిసెంబర్‌లో ప్రారంభమవుతున్న తరగతులు

విద్యా సంవత్సరం ఆలస్యంతో

విద్యార్థుల్లో ఆందోళన

అంతా అస్తవ్యస్తం..

డిగ్రీ అడ్మిషన్లపై ఎడతెగని జాప్యం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇంటర్‌ ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ డిగ్రీ కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల కాకపోవటంపై విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా డిగ్రీ కోర్సుల ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసి కౌన్సెలింగ్‌ చేపడుతోంది. అయితే ఈ పాటికే విద్యా సంవత్సరం ప్రారంభమై మిడ్‌ పరీక్షలు రాయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ నోటిఫికేషనే రాకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు నెలలు గడిచినా నిర్లక్ష్యమే..

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ రెండేళ్ల కోర్సుకు సంబంధించి ఫిబ్రవరి మూడో వారంలో ఇంటర్‌బోర్డు పరీక్షలను నిర్వహించింది. ఇంటర్మీడియెట్‌ ఫలితాలు ఏప్రిల్‌ మాసంలో వెలువడ్డాయి. ఫలితాలు ప్రకటించి నాలుగు నెలలు గడిచినా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటివరకు డిగ్రీ కోర్సుల అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. ఏటా ఏప్రిల్‌, మే మాసాలలో ఇంటర్‌ ఫలితాలు వెలువడితే, మే మాసంలో అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేసి జూన్‌ నెలలో కళాశాలల తరగతులు ప్రారంభించడం పరిపాటి.

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌తో ముడి..

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏటా ఇంటర్మీడియెట్‌ ఫలితాల తరువాత, ఏపీఈఏపీ సెట్‌ నిర్వహించి ఆ తరువాత వచ్చే వాటి ఫలితాలతో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది. అయితే గడిచిన రెండుమూడేళ్లగా ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తరువాత డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ గురించి ఆలోచన చేస్తోంది. ఆగస్టు వరకూ ఆ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు పూర్తయిన తరువాత డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులు వస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దాంతో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ పూర్తిగా ముగిసిన తరువాత ఈ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుండటంతో డిగ్రీ కళాశాల విద్యార్థులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు.

దెబ్బతింటున్న విద్యా సంవత్సరం..

ఏటా డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ ఆగస్టులో విడుదల చేయడం డిసెంబర్‌ మాసాంతం వరకు కొనసాగించడం వల్ల డిగ్రీ విద్యార్థుల విద్యా సంవత్సరంపై ప్రభావం చూపుతోంది. డిసెంబర్‌ లేదా జనవరి మాసాలలో అడ్మిషన్లు పూర్తి చేసి తరగతులను ప్రారంభిస్తున్నారు. దాని వల్ల మొదటి సెమిస్టర్‌ పూర్తి చేయడానికి ఏప్రిల్‌ లేదా మే మాసం వరకు తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం పూర్తయ్యే సమయానికి ఇంకొక సెమిస్టర్‌ పెండింగ్‌ ఉండటం.. అది పూర్తి చేయడానికి ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల వరకు సమయం పడుతూ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మే నెలలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించి జూన్‌ మాసంలో తరగతులు ప్రారంభించాల్సిన ఉన్నత విద్యాశాఖ ఇప్పటి వరకూ నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవటం దారుణం. కోర్సులు ముగిసినా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇటీవల అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఇతర ప్రాంతాల్లో సీట్లు పొందటానికి ఇక్కడి విద్యార్థులకు అవకాశం ఉండటం లేదు. దీనిపై ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలి.

– సాయికుమార్‌,

రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్‌ఎఫ్‌

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థులు పీజీ, తదితర కోర్సులకు సంబంధించి మంచి అవకాశాలు కోల్పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిగ్రీ కోర్సులతో సెమిస్టర్‌ పూర్తి కావడానికి జూన్‌ లేదా జూలై మాసాలు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల కావడం తదితర చర్యలతో ఇతర రాష్ట్రాలు, దేశాలలో ఉన్నత విద్యా కోర్సులు చేయడానికి అడ్మిషన్ల ప్రక్రియ సమయం ముగిసిపోతుంది. దాంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధమైన పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యా మండలి తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement