ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
భవానీపురం(విజయవాడపశ్చిమ): మిద్దైపె కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచుతూ పోషకాహారాన్ని అందిస్తున్న నేటి తరం అభినందనీయులని, ఈ సంస్కృతిని భావి తరాలకు నేర్పాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్(సీటీజీ) విజయవాడ ఐదో వార్షికోత్సవం ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మిద్దె తోటలతో ఆరోగ్యకర హరిత సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని, అలాగే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయన్నారు. అవకాశం ఉన్న ప్రతి కుటుంబం తమ ఇంటి మిద్దైపె తోటలను ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువులతో కూరలను పండించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని తెలిపారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే మొక్కల పెంపకంపై ఆసక్తి పెంపొందించడంతో ప్రకృతిపట్ల బాధ్యత ఏర్పడటంతో పాటు ఆరోగ్యవంతమైన భవిష్యత్‌కు బాటలు వేయవచ్చని అన్నారు. వేదికపై వ్యర్థ వస్తువులతో రూపొందించిన ఆకర్షణీయమైన కళాకృతులను చూసిన ఆయన వాటిని తయారుచేసిన హసీనాను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా వృద్ధ గార్డెనర్స్, సీటీజీ సభ్యులు బలిజేపల్లి వేణుగోపాలరావు–వరలక్ష్మి, పగడాల సుభాష్‌బాబు–ముత్యాల ఈశ్వరి, అబ్బూరి వెంకటేశ్వరరావు–విజయలక్ష్మి దంపతులు, యువగార్డెనర్ కె శ్రీనివాస్ తదితరులను సత్కరించారు. అనంతరం కలెక్టర్‌ను సైతం సీజీజీ అడ్మిన్లు ఆత్మీయంగా సన్మానించారు.


