● 1912 టోల్ ఫ్రీ నంబర్
ఎల్లప్పడూ అందుబాటులో ఉండాలి
● ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ వవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడ గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి మంగళవారం సర్కిల్ పరిధిలోని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఆపరేషన్స్)తో వర్చువల్ విధానంలో సమీక్షించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించి ముందుగానే ప్రజలకు సమాచారం తెలియజేయాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 1912, 83309 11912 వాట్సప్ నంబర్ సేవలను మరింత పటిష్టంగా అందించాలన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే పునరుద్ధరణకు చర్యలు చేపట్టి, వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూచించారు. నిర్మాణంలో సబ్ స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, సీజీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.


