లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ రెండు నెలల పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు రెండో రోజైన మంగళవారం కూడా విధులు బహిష్కరించి ఆందో ళన కొనసాగించారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే సోమవారం రాత్రి కూడా కార్మికులు నిరసన శిబిరంలోనే ఉన్నారు. తమకు జీతాలు ఎప్పుడు చెల్లించేదీ రాత పూర్వక హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. తమకు జీతాలు రాక పోవడంతో ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, పొదుపు రుణాలు చెల్లించలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో పాలు, పాత ఆస్పత్రి, దంత వైద్య కళాశాల, సిద్ధార్థ వైద్య కళాశాలల్లో పనిచేసే కార్మికులంతా ఈ నిరసనలో పాల్గొన్నారు. కార్మికులు విధులు బహిష్కరించడంతో మంగళవారం చేయాల్సిన సర్జరీలను వాయిదా వేశారు.
ఒక దశలో ఉద్రిక్తత
విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న కార్మికులు సూపరింటెండెంట్ కార్యాలయం ముట్టడించేందుకు వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు మూకుమ్మడిగా సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లడానికి వీలులేదని సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం ఇన్‌స్పెక్టర్ డి.వి. రమణ, పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో అక్కడే కొద్దిసేపు బైఠాయించారు. తమకు పెండింగ్ జీతాలతో పాటు, పీఎఫ్, ఈఎస్‌ఐ వివరాలు వెల్లడించాలన్నారు. కార్మికులకు సీఐటీయూ నేతలు అండగా నిలిచారు.
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మాతాశిశు మరణాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం మాతృ, శిశు మరణాలపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ కె.వి.ఎన్. అనీల్‌కుమార్, ఎన్‌హెచ్‌ఎం రివ్యూ అధికారి డాక్టర్ సతీష్‌కుమార్, స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ రత్న ఫాక్సీ, జీజీహెచ్ స్పెషలిస్టు నిపుణులు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన ఆరు మాతృ మరణాలపై సమీక్షించారు. జగ్గయ్యపేటలో రెండు, వెలగలేరు, చంద్రాల, గోళ్లమూడి, గంపలగూడెంలలో ఒక్కో మాతృమరణం జరిగిందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుహాసిని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, హై–రిస్క్ కేసులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతీదేవి పాల్గొన్నారు.


