గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తేవాలని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట పత్రికా విలేకరి జగన్మోహన్‌రెడ్డిని కిరాతకంగా హత్య చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హత్యను నిరసిస్తూ మంగళవారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. చావా రవి మాట్లాడుతూ.. గంధం మాఫియాపై వరుస కథనాలు రాయడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు జగన్మోహన్‌రెడ్డిని హత్య చేశారన్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు జర్నలిస్టుల రక్షణ చట్టం తక్షణమే తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్‌కే బాబు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, జర్నలిస్టు నాయకులు దారం వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, నారాయణ, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.


