బంకుల వద్ద రెండో రోజూ భారీ క్యూలు డీజిల్ కోసం రైతులకు తప్పని కష్టాలు క్యాన్లతో మండుటెండలో నిరీక్షణ ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు పరిమితులు
బంకుల వద్ద తగ్గని రద్దీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో డీజిల్, పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన సోమవారం బంకుల వద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి. గ్రామీణ ప్రాంతా ల్లోని బంకుల్లో డీజిల్ కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. ఇంధన కొరత రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. రైతుల అవసరాలకు సరిపడా డీజిల్ అందుబాటులో లేనిపరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్, కార్లు, హార్వెస్టర్లకు డీజిల్ పంపిణీలో కోత విధించారు. ఒక్కో ట్రాక్టర్‌కు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా డీజిల్ పంపిణీచేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో తెరిచి ఉన్న ప్రతి బంకు వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయి. ఉదయం నుంచి రద్దీ కొనసాగుతోంది. దూరప్రాంత ప్రయాణాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారు పెట్రోల్ బంక్‌ల వద్దే గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంక్‌ల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులను నియమించారు. ప్రతి బంక్‌లోనూ నగదు మాత్రమే స్వీకరిస్తూ ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ చెల్లింపులకు స్వస్తి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అన్ని వర్గాలకు ఈ దుస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో 321 బంకులు
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మొత్తం 321 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ బంకుల్లో రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో లేదు. ఇంధనం లేక ఆదివారం మూత పడిన పలు బంకులు సోమవారం సైతం తెరుచుకోని పరిస్థితి నెలకొంది. బంకుల రోజు వారీ అవస రాల కంటే పది శాతం అదనంగా ఇంధనం అందుబాటులో ఉంచుతామని అధికారులు చెప్పినప్పటికీ ఎక్కడా ఆ పరిస్థితి లేదని ప్రజలు మండిపడుతున్నారు. మొక్కజొన్న, వరి కోతలు వివిధ దశల్లో ఉన్నాయి. వరి కోతకు యంత్రాలు, కల్లాల్లో నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్లు అవసరం. డీజిల్ కొరతతో ఈ యంత్రాలు నిలిచిపోయాయి. డీజిల్ కొరత కారణంగా రైతుల అవసరాలకు సరిపడా ఇంధనం సరఫరా చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు మానుకుని బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవసరాలకు మించి డీజిల్, పెట్రోల్ పోయించుకోవడంతో సమస్య ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఇంధన కొరతను అధికారులు అంగీకరించడం లేదు. తిరువూరు, పెనుగంచిప్రోలు, వత్సవాయి, వీరులపాడు, గంపలగూడెం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొక్క జొన్న చివరి దశకు వచ్చింది. హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు సరిపడా ఇంధనం పోయడం లేదు. పెనుగంచిప్రోలులో ఏడు బంకులు ఉండగా కేవలం ఒక్క బంకులోనే డీజిల్ అందుబాటులో ఉంది. దీంతో రైతులు ఆ బంక్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆయిల్ క్యాన్లతో పెద్ద క్యూ ఏర్పాటు చేశారు. ఇక్కడ కారు, ట్రాక్టర్, హార్వెస్టర్‌లకు రూ.1000, ఆటోలకు రూ.200 విలువైన డీజిల్ కొడుతున్నారు. క్యాన్లు తీసుకెళ్లిన వారికి పది లీటర్ల చొప్పున డీజిల్ పోస్తున్నారు. ఇది ఏ మాత్రం సరిపోదని రైతులు ఆందోళన చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలోనూ అరకొరగానే డీజిల్ లభిస్తోంది. ఇక్కడ ట్రాక్టర్‌కు 20 లీటర్ల చొప్పున పోస్తున్నారు. గంపలగూ డెంలో ఓ బంక్ వద్ద మండుటెండలో రైతులు క్యాన్లతో డీజిల్ కోసం నిరీక్షించారు. తిరువూరులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ట్రాక్టర్లకు కూపన్లు అందజేస్తున్నారు. వత్సవాయి మండలంలో అందుబాటులో ఉన్న బంకుల్లో ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున డీజిల్ పోస్తుండంతో రైతులు పనులు నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెడ్డిగూడెంలో ఓ బంక్ వద్ద ట్రాక్టర్లు క్యూ కట్టాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో అక్వా రైతులు డీజిల్ కోసం ఓ బంక్ ఎదుట ఆందోళనకు దిగారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల బంకుల్లో ఇంధనం సరిపడా ఉంచా లని కోరుతున్నారు.
విజయవాడ నగరంలో ఏ తెరిచి ఉన్న బంక్ వద్ద చూసినా భారీ క్యూలైన్లు దర్శనమి చ్చాయి. కొన్ని బంకులను రెండో రోజు సోమవారం కూడా తెరవలేదు. బందరు రోడ్డులోని ఐఓసీఎల్ పైలెట్ బంక్, సబ్ కలెక్టర్ కార్యాలయ పెట్రోల్ బంక్, పోలీసు ప్రెట్రోల్ బంకుల్లో ఉదయం నుంచి రద్దీ కనిపించింది. గంటల కొద్ది క్యూ కొనసాగింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోశారు. నగరాల్లో ట్రావెల్స్, ఆటోవాలాలు, హోల్ సేల్ మార్కెట్‌లో సరుకు రవాణా ఆటోలు, ఐషర్ , మెటల్, మట్టి రవాణా లారీలు బంకుల వద్ద క్యూ కట్టాయి. కొన్ని ప్రైవేటు బంకులు డీజిల్, పెట్రోల్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందోనన్న ఆందోళనలో కార్మికులు ఉన్నారు. విజయ వాడ కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికులు ఇంధన కొరత తీర్చాలంటూ ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపారు.


