దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు

Apr 27 2026 8:42 AM | Updated on Apr 27 2026 8:42 AM

దుర్గమ్మ అన్నదానానికి విరాళాలు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వైఎంసీఏ ఉపాధ్యక్షుడిగా సుమన్‌ త్యాగరాజ్‌ పీఎన్‌బీఎస్‌లో అగ్ని ప్రమాదం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు ఆదివారం విరాళాలు సమర్పించారు. హైదరాబాద్‌ చింతల్‌కు చెందిన కమ్మిరి సునీల్‌, పావని దంపతులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,516ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. గుడివాడకు చెందిన జి.ఉమాదేవి కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

పెనమలూరు: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వైఎంసీఏ ఆఫ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ టి.సుమన్‌ త్యాగరాజ్‌ను నియమించారు. ఈ మేరకు ఆదివారం వివరాలు తెలుపుతూ సుమన్‌ త్యాగరాజ్‌ కానూరులో షాన్‌రాక్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలతో పాటు విజయవాడలో సెయింట్‌ జోన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన సౌత్‌, ఈస్ట్‌ జోన్‌ ఇండియా రీజన్‌ వైఎంసీఐ చైర్మన్‌గా ఉన్నారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ వైఎంసీఏ ఆఫ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఆయన 2026–29 వరకు పదవిలో ఉంటారు. యువత అభివృద్ధి, సామాజిక సేవలు, విద్యా ప్రమాణాలు పెంపొందించడంతో సుమన్‌ త్యాగరాజ్‌ ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయనకు పదవి రావడంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

బస్టాండ్‌(విజయవాడపశ్చిమ): పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. పీఎన్‌బీఎస్‌ అరైవల్‌ బ్లాక్‌ మెదటి అంతస్తులో సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం సెలవు దినం కావటంతో వివిధ దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్‌ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిట లాడుతుంది. ఒక్కసారిగా బస్టాండ్‌లో మంటలు చెలరేగటంతో ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మెదటి అంతస్తులో ఉన్న కార్యాలయాల్లోని పాత ఫర్నిచర్‌ను బయట బాల్‌కానీలో ఉంచారు అవి అగ్ని ప్రమాదంలో కాలీ బూడిదయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. ఆదివారం కావడంతో సిబ్బంది ఎవరూ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement