భవానీపురం(విజయవాడపశ్చిమ): తన జీవితాన్ని యోగా మార్చిందని, నిత్యం యోగా చేసేవారికి సాధారణ రోగాలు దరి చేరకపోవడంతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరుతుందని ప్రముఖ యోగాచార్యులు, శ్రీ వేంకటేశ్వర యోగ సేవా కేంద్రం(మంగళగిరి) వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీ వేంకటేశ్వర యోగి గురూజీ పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర యోగ సేవా కేంద్రం విజయవాడ నగర శాఖల ఆధ్వర్యంలో వెయ్యి యోగా శిక్షణా శిబిరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భవానీపురం –2 శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విరాట్ యోగా – 1000’ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత డాక్ట్ వేంకటేశ్వర యోగి జీవిత విశేషాలతో రూపొందించిన ‘అధునాతన యోగి – ఆదర్శ పథగామి’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. వెయ్యి శిక్షణ శిబిరాల్లో ఉచితంగా యోగా నేర్పిన గురువులు, సహకరించిన కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. రెండున్నర దశాబ్దాల నుంచి గురువుల కృషితో సుమారు రెండున్నర లక్షల మంది యోగా నేర్చుకోగలిగారని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భవానీపురం – 2 శాఖ అధ్యక్షుడు బొమ్మిశెట్టి తిరుమల రమేష్ మాట్లాడుతూ తమ శాఖ కార్యవర్గ సభ్యుల సహకారంతో గురువులను సత్కరించి గౌరవించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని భవానీపురం –2 శాఖ ఉపాధ్యక్షులు కొయ్య సూరిబాబు, ఊటుకూరి శ్రీమన్నారాయణ, ప్రధాన కార్యదర్శి తుమ్మలపెంట నాగేశ్వరరావు, కోశాధికారి కొత్తమాసు రత్నాకరరావు, మంజుల యోగి మాతాజి, వేమన యోగి గురూజీలు నిర్వహించారు.


