తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మ వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి భక్తులకు ఆలయ వేద పండితులు దిలీప్‌కుమార్‌ సౌజన్యంతో ఆలయం వారు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావటంతో గ్రామంలో ట్రాఫిక్‌ సమస్యలు కూడా ఏర్పడ్డాయి.

దుర్గమ్మకు కానుకగా

బంగారు హారం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఆదివారం రూ. 3.54లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీకి చెందిన వేమూరి శివరామప్రసాద్‌ కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి సుమారు 23 గ్రాముల బంగారం, రూ. 3,54,292 విలువ కలిగిన బంగారు హారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు

నేడు పామర్రుకు కృష్ణా కలెక్టర్‌

చిలకలపూడి(మచిలీ పట్నం): వారం రోజులుగా వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవుపై వెళ్లిన కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ సోమవారం విధులకు హాజరుకానున్నారు. ఇప్పటి వరకు జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌ ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా వ్యవహరించారు. కాగా సోమవారం ఉదయం కలెక్టర్‌ డీకే బాలాజీ పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో పర్యటించనున్నారు. మే 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పమిడిముక్కలలోని ఎన్టీఆర్‌ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హాజరుకానున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం మచిలీపట్నం కలెక్టర్‌లో జరిగే మీకోసం కార్యక్రమానికి హాజరవుతారు.

ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందాలి

లబ్బీపేట(విజయవాడతూర్పు): జబ్బు చేసి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ప్రతిరోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు అన్నారు. ఆయన ఆదివారం జీజీహెచ్‌ లోని సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యూరాలజీ, కార్డియాలజీ వార్డులను సందర్శించి, ఆయా వార్డులోని రోగులతో మాట్లాడారు. వైద్యం సక్రమంగా అందుతుందా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అటెండెంట్స్‌తో పాటు, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే సత్వరమే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. అదే విధంగా రోగులు వాడే టాయిలెట్స్‌ను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట డెప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ సూర్యమంగాదేవి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement