ఇంధన కొరతతో అల్లాడుతున్న రాష్ట్రం | - | Sakshi
Sakshi News home page

ఇంధన కొరతతో అల్లాడుతున్న రాష్ట్రం

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

● అయినా పట్టించుకోని 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని

చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్రంలో మూడు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ దొరక్క బంకుల వద్ద ప్రజలు క్యూ కుడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అగచాట్ల మాటున పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులు నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిపై చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌కు స్పృహ లేకుండా పోతోందన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తరువాత కొరత మరింత ఎక్కువైందన్నారు. ఈరోజు కూరగాయలు, పండ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్‌ లేని పరిస్థితి నెలకొందని, కాంక్రీట్‌ మిక్చర్లు ఆడటం లేదని, కూలీలకు పని దొరకటం లేదని, ఇదంతా బ్లాక్‌ మార్కెటర్లకు పండుగలా మారిందని పేర్కొన్నారు.

అనుభవం ఏమైంది?

రాష్ట్రం కోసం కేంద్రంలో నడుస్తున్న మోదీ ప్రభుత్వంలో కూటమి ఎంపీలతో మీ పలుకుబడిని వాడలేరా అని చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు తన పలుకుబడిని హద్దులు లేని అప్పులు తీసుకురావడానికి, వైఎస్సార్‌ సీపీ నాయకుల మీద ఈడీ సోదాలు, సీబీఐ కేసులు పెట్టడానికే వాడుతున్నారని విమర్శించారు. ఇలా అని సాక్షాత్తూ చంద్రబాబు తమ్ముడే చెబుతున్నారన్నారు. 2047వ సంవత్సరానికి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానని చెబుతున్న చంద్రబాబు ఈవాళ ప్రజలు పడుతున్న కష్టాలను చూడరా అని నిలదీశారు.

ముగ్గురూ ముగ్గురే..

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పది రోజులుగా నారా లోకేష్‌ కనిపించటం లేదని పేర్ని నాని విమర్శించారు. పవన్‌కల్యాణ్‌కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. తక్షణం చంద్రబాబు మేల్కొని సొరకాయ కోతలు ఆపి మోదీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కించాలని పేర్ని నాని డిమాండ్‌ చేశారు.

సింగపూర్‌కు వెళ్లిన మంత్రులకు ప్రశ్న..

నీతి, నిజాయితీలకు, అవినీతి రహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరుగా సింగపూర్‌ను భావిస్తుంటారని, చంద్రబాబు సావాసం కోసం సింగ పూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ఇక్కడకు వచ్చి ఆయన దగ్గర అవినీతిని నేర్చుకుని అక్కడ అవినీతి పాలయ్యారని పేర్ని నాని గుర్తుచేశారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్‌కు వెళ్లటం వల్ల ఆ దేశస్తులు చెడిపోకుండా ఉంటే చాలన్నారు. వ్యవసాయం లేని చోటికి వ్యవసాయ మంత్రి వెళతారని, పరిశ్రమలు ఎలా పెట్టుకోవాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్లారని ఎద్దేవా చేశారు. మునిసిపాలిటీలు, ఆర్‌అండ్‌బీలకు రోడ్లు వేయడానికి నిధులు ఇవ్వరు కాని సింగపూర్‌కు వెళ్లి వీరు ఏం నేర్చుకుంటారో చూడాలన్నారు. ఐదారు కోట్ల రూపాయలు వారి పర్యటనకు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్‌ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు, లంకే వెంకటేశ్వరరావు, బందెల థామస్‌నోబుల్‌, తిరుమలశెట్టి ప్రసాద్‌, చలమలశెట్టి గాంధీ, ఐనం తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement