కార్డియాక్‌ ఎనస్థీషియాపై సదస్సు | - | Sakshi
Sakshi News home page

కార్డియాక్‌ ఎనస్థీషియాపై సదస్సు

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్డియాక్‌ ఎనస్థీషియాలో అధునాతన పద్ధతులపై నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఆదివారం సదస్సు జరిగింది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం సహకారంతో సిద్ధార్థ వైద్య కళాశాల ఎనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆశ్రమ్‌, పిన్నమనేని సిద్ధార్థ, నిమ్రా, ఎన్‌ఆర్‌ఐ, ప్రభుత్వ సిద్ధార్థ కళాశాలలకు చెందిన 250 మంది ఎనస్థీషియా పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ఈ సదస్సును వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయుష్‌ ఆస్పత్రి చీఫ్‌ కార్డియాక్‌ ఎనస్థీషియన్‌ డాక్టర్‌ వై. రమేష్‌ బాబు గతంలో ఉన్న విధానాలు, ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌పై యువ వైద్యులకు అవగాహన కలిగించారు. సిద్ధార్థ వైద్య కళాశాల ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ సొంగా వినయ్‌కుమార్‌ అధ్యక్షత వహించగా, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అకడమిక్‌ సెనేట్‌, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భీమేశ్వర్‌, సెయింట్‌ ఆన్స్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి. కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ పరిశీలకులుగా డాక్టర్‌ సి. శ్యామ్‌కుమార్‌ వ్యవహరించారు.

సుబ్బారాయుడి ఆలయంలో సినీనటుడు పూజలు

మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ప్రముఖ సినీనటుడు బాబీసింహా కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్ధు సతీష్‌ శర్మ, విరూప్‌ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement