వైద్యాన్ని నిర్వీర్యం చేసే కుట్ర | - | Sakshi
Sakshi News home page

వైద్యాన్ని నిర్వీర్యం చేసే కుట్ర

Apr 26 2026 5:15 AM | Updated on Apr 26 2026 5:15 AM

సూపర్‌ స్పెషాలిటీల్లో వైద్యుల కొరత వైద్యుల కొరత ఇలా...

మూడు కీలక విభాగాల్లో అసిస్టెంట్‌లు లేని వైనం

దీంతో కాల్‌ డ్యూటీలు చేస్తున్న ప్రొఫెసర్‌లు

రోగులకు సేవలందించడంలో ఇబ్బందులు

కష్టతరంగా ఓపీల నిర్వహణ

వైద్యుల నియామకాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం

వైద్యుల ఖాళీలు భర్తీ చేయాలి

సూపర్‌ స్పెషాలిటీల్లో వైద్యుల కొరత

గ్యాస్ట్రో ఎంట్రాలజీ : ప్రొఫెసర్‌ –1

అసిస్టెంట్స్‌ ప్రొఫెసర్స్‌–2

న్యూరోసర్జరీ : అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌–2

సీటీవీఎస్‌ : అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌–2

న్యూరాలజీ : అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌–2

కార్డియాలజీ : ప్రొఫెసర్‌ –1,

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–1

జనరల్‌ మెడిసిన్‌ : ప్రొఫెసర్స్‌–2

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాణాపాయంలో ఉన్న రోగులకు సేవలు అందించడంలో కీలకమైన సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యుల కొరత నెలకొంది. ఏకంగా మూడు విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు ఒక్కరు కూడా లేని దయనీయ స్థితి. మరో రెండు కీలక విభాగాల్లో ఒక్కొక్కరు అసిస్టెంట్‌లు ఉండగా, మరో విభాగంలో ప్రొఫెసర్‌ లేని వైనం. దీంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్రజాప్యం నెలకొంటోంది. గంటల కొద్దీ ఓపీలో వేచి ఉండాల్సి వస్తోందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్యులను భర్తీ చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేలా పాలన కొనసాగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులో సేవలు దిగజారాయంటున్నారు.

కీలక విభాగాల్లో కొరత

వైద్య సేవలు అందించడంలో కీలకమైన సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లోనే వైద్యుల కొరత ఉంది. ప్రతి విభాగంలో ఒక ప్రొఫెసర్‌, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఇద్దరు లేక ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు ఉండాల్సి ఉంది. కానీ ప్రభుత్వాస్పత్రి న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సీటీవీఎస్‌ విభాగాల్లో ఒక్కరు కూడా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లేని దయనీయ స్థితి నెలకొంది. అంతేకాదు గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ప్రొఫెసర్‌ కూడా లేరు. ఒకే ఒక్క వైద్యుడు విభాగాన్ని నడపాల్సి వస్తోంది. మరోవైపు కార్డియాలజీలో ప్రొఫెసర్‌ లేరు. ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు ఖాళీగా ఉంది. న్యూరాలజీలో ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు ఖాళీగా ఉంది.

రోగుల సేవల్లో ఇబ్బందులు

సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరోసర్జరీ ఓపీ సేవలు వారంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తుంటారు. ఆ విభాగాల్లో నిర్వహించే ఓపీలకు 300 నుంచి 350 మంది వరకూ రోగులు వస్తుంటారు. ఒకరిద్దరు వైద్యులే ఉండటంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం కష్టతరంగా మారుతోంది. అంతేకాదు గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఒకే ఒక్క వైద్యుడు ఉండటం, 300 మందికి వైద్య పరీక్షలు, వార్డుల్లో కేసులు, ఇతర వార్డుల్లో ఉన్న వారిని చూడటం కష్టంగా మారుతోంది. రోగులు వైద్య సేవలు పొందడంలో జాప్యం జరుగుతోంది. న్యూరాలజీలో సైతం ఒక్కరే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉండటం, ఓపీ రోజుల్లో 350 మంది వరకూ రోగులు వస్తుండటంతో ఓపీ ముగిసే సరికి మధ్యాహ్నం 3 గంటలు దాటుతోంది.

ప్రొఫెసర్‌లే కాల్‌ డ్యూటీలు చేయాల్సివస్తోంది

అత్యవసర కేసు వచ్చినా, వార్డులో ఉన్న వారి పరిస్థితి విషమిస్తున్నా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు ఉంటే వాళ్లే మానిటరింగ్‌ చేస్తుండే వాళ్లు. ఏదైనా అత్యవసరం అయితే ప్రొఫెసర్‌, హెచ్‌ఓడీలకు సమాచారం ఇస్తారు. కానీ ప్రస్తుతం కీలకమైన న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సీటీవీఎస్‌ విభాగాల్లో అసిస్టెంట్‌లు లేని కారణంగా ప్రొఫె సర్‌/హెచ్‌ఓడీలు కాల్‌ డ్యూటీలు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది. ముఖ్యంగా సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లోనే ఈ దయనీయ స్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని వైద్య రంగానికి చెందిన వారు అంటున్నారు. వైద్యుల నియామకాలు చేపడితే అసిస్టెంట్‌లు వస్తారని అంటున్నారు.

ప్రభుత్వాస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలి. ముఖ్యంగా సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పూర్తి స్థాయిలో వైద్యులను నియమించి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి. ప్రభుత్వం తీరుతో ప్రభుత్వాస్పత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఆ పరిస్థితి మారేలా చర్యలు తీసుకోవాలి.

–డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం

Advertisement
 
Advertisement
Advertisement