లబ్బీపేట(విజయవాడతూర్పు): దోమలను నివారించడం ద్వారానే మలేరియా సోకకుండా చూడగలమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నియంత్రణ, అవగాహనపై శనివారం పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మలేరియాకు కారణమైన దోమలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని, దోమలు వ్యాప్తిచెందకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. నగరంలో కాలువలు డ్రైన్లలో మురుగునీరు నిల్వ ఉండకుండా నగర పాలక సంస్థ, జలవనరుల శాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను ప్రతి సచివాలయానికి అనుసంధానించాలని అన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతిదేవి, డీఐఓ డాక్టర్ శరత్‌బాబు, ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్ మాధవీ నాయుడు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, జిల్లా మలేరియా అధికారి రాజునాయక్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ సునీల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.


