చిలకలపూడి(మచిలీపట్నం): వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యంత్ర పరికరాలను ఉపయోగించి సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ అన్నారు. ఉయ్యూరు వీరమ్మతల్లి దేవాలయ ఆవరణలో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర 4వ మహాసభలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఎగ్జిబిషన్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశాలను శోధించాలన్నారు. అవసరం మేరకే ఎరువులు, పురుగు మందులు వాడాలని, అనవసరంగా మందులు విచ్చలవిడిగా వాడకూడదని సూచించారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక రంగాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఒక యాప్‌ను తీసుకొచ్చారని, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చేలా యాప్‌ను రూపొందించారని, దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కౌలు రైతు లేనిదే వ్యవసాయమే లేదు
మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతు లేనిదే వ్యవసాయమే లేదన్నారు. వ్యవసాయానికి కౌలు రైతులే మూలమైనా అప్పుల వల్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో కౌలు చట్టాలు రద్దయ్యాయని తెలియక భూ యజమానులు కౌలు రైతులకు సంతకం పెట్టడం లేదన్నారు. సంతకం పెడితే భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం తరఫున ప్రకటన ఇవ్వాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్‌లో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు ఉపయోగించే వివిధ రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, డ్రోన్లను ప్రదర్శించారు. భారత రైతాంగ ఉద్యమఘట్టాల ఫోటోలను ప్రదర్శించారు. కె. విశ్వమోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, మాగంటి హరిబాబు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు కె.చంద్రశేఖర్, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీవీ లక్ష్మణస్వామి, పి.రంగారావు, శివనాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్


