కబళిస్తున్న | - | Sakshi
Sakshi News home page

కబళిస్తున్న

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

కాలకూటం! ఏ.కొండూరులో విజృంభిస్తున్న కిడ్నీ భూతం

ప్రచార ఆర్భాటంగానే శుద్ధ జలాల సరఫరా ఫ్లోరైడ్‌ నీటినే తాగుతూ మంచాన పడుతున్న జనాలు చికిత్స కూడా సక్రమంగా అందక మృత్యువాత అసంపూర్తిగా జలజీవన్‌ మిషన్‌ పనులు కృష్ణా పైలెట్‌ ప్రాజెక్టుపైనే ఆశలు

సత్వర చికిత్స అందించాలి

పైలెట్‌ ప్రాజెక్టు త్వరగా పూర్తిచేయాలి

కాలకూటం!
ఏ.కొండూరులో విజృంభిస్తున్న కిడ్నీ భూతం

తిరువూరు: ఏకొండూరు మండలంలో కిడ్నీవ్యాధి శాశ్వత నివారణకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పేదలకు అక్కరకు రావట్లేదు. కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు ఇబ్రహీంపట్నం నుంచి ఏకొండూరు మండలానికి పైపులైన్ల ఏర్పాటు ప్రక్రియ రెండేళ్లుగా నత్తనడకన సాగుతోంది. కిడ్నీ రోగాల బారిన పడిన వారికి ఏకొండూరు, తిరువూరులలో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ వ్యాధి నివారణకు అవసరమైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవట్లేదు. నెఫ్రాలజిస్టులను నియమించి సకాలంలో చికిత్స అందిస్తే గిరిజనులు కిడ్నీ వ్యాధి కారణంగా మృత్యు ఒడిని చేరకుండా అరికట్టవచ్చని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.

ఏకొండూరులో ఇదీ పరిస్థితి..

ప్రస్తుతం ఏకొండూరు మండలంలో 23 మంది కిడ్నీ బాధితులు డయాలసిస్‌ చేయించుకుంటుండగా, 2 శాతం సీరం క్రియాటిన్‌తో 175 మంది, 1.5 శాతం క్రియాటిన్‌తో 81 మంది చికిత్స పొందుతున్నారు. జలజీవన్‌ మిషన్‌ పథకంలో సుమారు రూ.45కోట్ల వ్యయంతో అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరందించడంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని పలు గ్రామాల కిడ్నీ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైతన్యనగర్‌, కుమ్మరకుంట్ల, ఏకొండూరు, గోపాలపురం, అట్లప్రగడ, కోడూరు, మారేపల్లి, చీమలపాడు, కృష్ణారావుపాలెం, మాధ వరం, కేశ్యా తండా, ఏకొండూరు తండా, రేపూడి తండా, పెదతండా, గామా తండాలలో మూడు నెలల్లో 10కి పైగా కిడ్నీ రోగుల మరణాలు సంభవించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు?

కిడ్నీ రోగాల బారిన పడకుండా ఏకొండూరు మండలంలోని అన్ని గ్రామాలకు, తండాలకు కృష్ణా నదీ జలాలందించే పైలెట్‌ ప్రాజెక్టుకు పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిచేసి నీరందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు ప్రకటించినప్పటికీ కార్యాచరణలో అడుగు ముందుకు పడలేదు. గ్రామాల్లో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు రక్షిత నీరందించడానికి ప్రధాన పైపులైన్ల నిర్మాణం, ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరందించే ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతాయో అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నుంచి సరఫరా చేస్తున్న నీరు పాత పైపులైన్ల లీకేజీతో పలుచోట్ల వృథాగా పోతోంది. అన్ని గ్రామాల్లో కొత్త పైపులైన్లు నిర్మిస్తామని గతంలో అధికారులు చెప్పినా పాత పైపులైన్లతోనే సరఫరా చేస్తున్నారు.

రక్షిత మంచినీరందక కిడ్నీవ్యాధి బారిన పడిన గిరిజనులకు డయాలసిస్‌ చేయించడంతో పాటు సత్వర చికిత్స అందించాలి. నెఫ్రాలజిస్టును రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమించి ఏకొండూరు ఆస్పత్రిలో వైద్యసేవలు లభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డయాలసిస్‌ బారిన పడిన వారికి పౌష్టికాహారం కూడా సక్రమంగా అందించాలి.

– మేకల డేవిడ్‌, ఏకొండూరు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో యుద్ధప్రాతిపదికన ఏకొండూరు మండలానికి కృష్ణా జలాలు అందించేందుకు నిధులు కేటాయించి పనులు చేపట్టగా... గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగారుస్తోంది. అధికారుల పర్యవేక్షణాలోపం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఏకొండూరు మండలంలో గిరిజనులు కిడ్నీవ్యాధి బారిన పడి చనిపోతున్నారు. వెంటనే పైలెట్‌ ప్రాజెక్టు పూర్తిచేసి అన్ని గ్రామాలకూ కృష్ణా జలాలు అందించాలి.

– నల్లగట్ల స్వామిదాసు, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి

Advertisement
 
Advertisement
Advertisement