వరుస నష్టాలతో మామిడి రైతు కుదేలు
కళతప్పిన మ్యాంగో మార్కెట్ తెగుళ్లతో నేలరాలిన కాయలు తరిగిపోయిన సాగు విస్తీర్ణం కనిపించని బంగినపల్లి రకం
దిగుబడీలా..
తిరువూరు: ఏటా వేసవిలో మామిడి కాయల ఎగుమతులు, దిగుమతులతో కళకళలాడే తిరువూరు డివిజన్లోని మార్కెట్లు ఈ ఏడాది దిగుబడి లేక వెలవెలబోతున్నాయి. దీర్ఘకాలంగా మామిడి తోటల సాగుతో జీవనం సాగించే రైతాంగం వాతావరణ ప్రతికూలత, ఉన్న తోటల్లో తెగుళ్లతో పూత, పిందె రాలిపోయి వాటిని కోనేవారు ముందుకు రాలేదు. తిరువూరు డివిజన్లోని ఐదు మండలాల్లో 60వేల ఎకరాల మామిడి తోటలుండగా ఈ ఏడాది 30వేల ఎకరాల్లో నామమాత్రంగా కాపు నిలిచింది. మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న బంగినపల్లి రకం మామిడికాయలు మాత్రం పూర్తిగా కనుమరుగవడంతో ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, చైన్నె తదితర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ ఏడాది ముఖం చాటేశారు. మామిడి సీజన్లో ఎగుమతి, దిగుమతి కూలీలు, దళారులు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్ల డ్రైవర్లు వందలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతుండగా, మార్కెట్ ప్రతికూలతతో పరిస్థితి తారుమారైంది.
తెగుళ్లతో నష్టాలు..
ఏటా పూత దశలోనే ప్రారంభమవుతున్న తెగుళ్లు పిందెదశలో ఉద్ధృతమై కాపు నేలరాలిపోయి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఏడాది సైతం నల్లతామర, తేనెమంచు తెగుళ్లతోపాటు ఇతర తెగుళ్ల కారణంగా మామిడికాయలు నేలరాలిపోతున్నాయి. తోతాపురి, చిన్న రసాలు, పెద్ద రసాల దిగుబడి సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో గిరాకీ లేకపోవడంతో తక్కువ ధరకే అమ్మక తప్పని స్థితి నెలకొంది. వాతావరణ ప్రభావంతో రైతులు భయపడి సీజన్ ప్రారంభం నుంచే ఎదుగుదల రాకపోయినా కాయలు కోసి అమ్మేసుకోవడంతో ధర గిట్టుబాటు కావట్లేదు. సీజన్ మొదట్లో తోతాపురికి టన్ను రూ.25వేలు, రసాలు రూ.35వేల చొప్పున ధర పలకగా, ప్రస్తుతం సగం ధర కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. బంగినపల్లి రకానికి టన్ను రూ.30వేలకు పైగా ధర పలుకుతున్నా మార్కెట్లో కనిపించట్లేదు. మామిడి రుచి చూద్దామని ఆశించేవారికి డజను కాయలు వందలాది రూపాయల ధర పలుకుతుండటంతో వెనక్కు తగ్గుతున్నారు.


