లబ్బీపేట(విజయవాడతూర్పు): మలేరియాను సమూలంగా నిర్మూలించి, మలేరియా రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించి, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ జిల్లాలో మలేరియాపై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మలేరియా అధికారి రాజు నాయక్, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతిదేవి, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాధవీనాయుడు, డీపీఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
పటమట(విజయవాడతూర్పు): అమృత్ 2.0 పనులను మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డెప్యూటీ సెక్రటరీ గ్రేస్ లాల్‌రిండికి పచువా శుక్రవారం పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని కనకదుర్గా నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఈఎస్‌ఎల్‌ఆర్‌ను పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సీఈ సత్యకుమారి, ఏపీయూ ఎఫ్‌ఐడీసీ ఎస్‌ఈ ఎన్‌వీ రావు, పీడీఎంసీటీం లీడర్ టి. ఆంజనేయులు, వీఎంసీ సర్కిల్–3 ఈఈ జి. సామ్రాజ్యం పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలపై యువత మక్కువ చూపడం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందవచ్చని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి (అండర్–19) రవికాంత అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం జరిగింది. అండర్–15, అండర్–19 బాయ్స్ అండ్ గరల్స్ విభాగంలో వేర్వేరుగా పోటీలను నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వైజాగ్‌లో మే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి జట్టులో ఎంపికై న క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి కె.కోటేశ్వరరావు పతకాలు అందజేసి అభినందించారు.
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ వేడినీటి కాలువ వంతెనపై వెళ్తున్న కారులో అనూహ్యంగా మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న వారు కారును నిలిపేసి కిందకు దిగారు. సమీపంలో ఉన్న వాహనదారులు ఆగి ఉన్న లారీల్లోని బక్కెట్లతో కాలువలో నీటిని తీసుకొచ్చి చెలరేగిన మంటలపై పోయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. నీరు అందుబాటులో లేని ప్రదేశంలో మంటలు చెలరేగి ఉంటే కారు మొత్తం దగ్ధమై ఉండేది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి అపాయం జరగలేదు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కారును రోడ్డుపై నుంచి పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


