అవినీతి ‘కొండ’! | - | Sakshi
Sakshi News home page

అవినీతి ‘కొండ’!

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్‌ ఇంట ఏసీబీ సోదాలు భారీగా వెండి, బంగారం, ఇతర ఆస్తి పత్రాలు స్వాధీనం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖలో అతనొక దిగువస్థాయి ఉద్యోగి. కానీ ఏకంగా అవినీతి నిరోధక శాఖ అతనిపై వలపన్ని పట్టుకొని అరెస్ట్‌ చేసే స్థాయిలో అవినీతికి పాల్పడి సంచలనం సృష్టించిన సంఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ గవర్నరుపేట సర్కిల్‌ కార్యాలయంలో కొండపల్లి శ్రీనివాసరావు ఆఫీస్‌ సబార్డినేట్‌గా (అటెండర్‌గా) పని చేస్తున్నాడు. అతనిపై అనేక ఆరోపణలు వస్తుండటంతో అవినీతి నిరోధక శాఖ గత ఏడాది అక్టోబర్‌ 16వ తేదీన వలపన్ని పట్టుకుంది. రూ.16 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అనంతరం కొండపల్లి శ్రీనివాసరావు రిమాండ్‌ విధించగా ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చాడు. అలాగే ఆ శాఖలో సస్పెన్షన్‌లో ఉన్నాడు.

ఆదాయానికి మించి ఆస్తులు..

తాజాగా కొండపల్లి శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా అవినీతి నిరోధక శాఖ విచారణలో వ్యక్తమైంది. దాంతో ఆయనపై మరో కేసు నమోదు చేసి శుక్రవారం నగరంలోని శ్రీనివాసరావు ఇంటితో పాటుగా ఆయన బంధువులకు చెందిన మరో రెండు ఇళ్లలో మొత్తం మూడు ఇళ్లలో ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. అందులో వెండి, బంగారంతో పాటుగా పలు, ఆస్తి పత్రాలు కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో వెలుగు చూసిన ఆస్తులలో ఒక భవనం, ఒక ఇంటి స్థలం, ఐదు బంగారు బిస్కెట్లతో కలిపి సుమారు 760 గ్రాముల బంగారం, సుమారు 7,800 గ్రాముల వెండి, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ. 22లక్షల నగదు నిల్వలు, కొంత మొత్తంలో చేతి నగదు, విలువైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రెండు మోటార్‌ సైకిళ్లు, విలువైన గృహోపకరణాలు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ నిందితుడు, ఆయన భార్య, కుమారుడి పేర్ల మీద ఉన్నాయి. ఇవన్నీ విజయవాడ నగర పరిధిలోనే ఉన్నాయి. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లుగా అధికారులు ప్రకటించారు. కొండపల్లి శ్రీనివాసరావును నిబంధనల ప్రకారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement