సాగు భూముల్లో మట్టి దందా! | - | Sakshi
Sakshi News home page

సాగు భూముల్లో మట్టి దందా!

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

సాగు భూముల్లో మట్టి దందా! కవులూరులో అనుమతుల్లేకుండా తవ్వకాలు

డబ్బు ఆశతో లీజుకిస్తున్న భూ యజమానులు రాత్రి వేళల్లో ఇటుక బట్టీలకు భారీగా మట్టి తరలింపు 12 లారీలు, ఒక పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్న జి.కొండూరు పోలీసులు స్పందించని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు

స్పందించని అధికారులు...

కవులూరులో అనుమతుల్లేకుండా తవ్వకాలు

జి.కొండూరు: బంగారంలాంటి సాగుభూములను కొందరు సర్వనాశనం చేస్తున్నారు. సంప్రదాయ సాగును వదిలేసి అధిక లీజుకు ఆశపడుతున్న భూ యజమానులు వారికి సాగు భూములను అప్పగించేస్తున్నారు. ఈ భూముల్లో భారీ గోతులు తవ్వి మొత్తటి నల్లమట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండల పరిధి కవులూరులో కొన్ని రోజులుగా జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలకు జి.కొండూరు పోలీసులు బుధవారం రాత్రి అడ్డుకట్ట వేశారు. వివరాల్లోకి వెళ్తే.. కవులూరు శివారులోని వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌కు సమీపంలో 11 ఎకరాల సాగుభూములున్నాయి. వీటిలో కొందరు కొన్ని రోజులుగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ భూముల్లో చేపల చెరువులను ఏర్పాటు చేస్తున్నట్లు కొంత మట్టిని కట్టలుగా ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా పది అడుగుల మేర లోతుగా తవ్వకాలు చేసి రాత్రి వేళల్లో భారీగా మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఒక్కొక్క లారీ మట్టికి రూ.3 వేలు సదరు భూ యజమానులకు కొందరు ఇటుక బట్టీల నిర్వాహకులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. తవ్వకాల ఖర్చు, రవాణా చార్జీలను బట్టీల నిర్వహకులే చెల్లిస్తున్నారు. అధిక ఆదాయం వస్తుండటంతో మరి కొందరు వారి భూములను కూడా మట్టి తవ్వకాలకు లీజుకివ్వడానికి సిద్ధమవుతున్నారు.

తవ్వకాలను అడ్డుకున్న పోలీసులు

సాగు భూముల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు బుధవారం రాత్రి అక్కడికి చేరుకొని వాటిని అడ్డు కున్నారు. తవ్వకాలు జరిగే చోట 12 టిప్పర్‌ లారీలు, ఒక పొక్లయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మట్టి తవ్వకాల కోసం అనుమతులు ఉంటే పూర్తి పత్రాలతో పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పారు. అప్పటి వరకు ఎటువంటి తవ్వకాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సాగు కష్టమే

మట్టి తవ్వకాలు పూర్తయిన తర్వాత పది అడుగుల మేర పల్లం కావడంతో ఇక ఆ భూమి సాగుకు పనికొచ్చే అవకాశం లేదు. మట్టి తవ్వకాలు చేసి విక్రయించిన అనంతరం చేపల చెరువులకు లీజుకిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా కవులూరులో 155.5 ఎకరాల విస్తీర్ణంలో 39 చెరువులను నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ శివారులో ఒక వైపు తారకరామ ఎత్తిపోతల పథకం, మరో వైపు బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ ఉండటంతో పుష్కలంగా నీరు అందుబాటులో ఉండి చేపల చెరువుల నిర్వహణకు అనువుగా మారింది. ఏడాదికి ఎకరానికి రూ.50 వేల వరకు లీజు ఇస్తున్న క్రమంలో రైతులు కూడా చెరువులకు ఇవ్వడానికి సిద్ధపడటంతో ఇక్కడ సాగు పడిపోతుంది. కొందరు రైతులు చేపల చెరువులకు లీజుకివ్వడంతో వాటి నుంచి వచ్చే ఊటతో పక్కన ఉన్న సాగు భూములపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో గత్యంతరం లేక ఇరుగుపొరుగు రైతులు కూడా లీజుకివ్వాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

కవులూరు శివారులో సాగు భూముల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్న అంశం బహిరంగమే అయినా రెవెన్యూ, మైనింగ్‌ శాఖ అధికారులు ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు తవ్వకాలను అడ్డుకొని వాహనాలను స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా అధికారులు వెళ్లకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ తతంగమంతా సాగుతోందని చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement