రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ టికెట్ తనిఖీల ద్వారా జోన్‌లోనే సరికొత్త రికార్డును నమోదు చేసు కుంది. ఈ నెలలో కేవలం 22 రోజుల్లోనే టికెట్ తనిఖీల ద్వారా రూ.10 కోట్ల ఆదాయం నమోదు చేసుకుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే ఒక చారిత్రాత్మక విజయంగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా కొనియాడారు. ఏప్రిల్ క్యాలెండర్ నెలలో ఏడు రోజులు మిగిలి ఉండగానే ఈ భారీ ఆదాయం జోన్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నమోదైందన్నారు. గత అక్టోబర్ 2025లో డివిజన్ సాధించిన అత్యధిక ఆదాయం రూ.8.59 కోట్ల రికార్డును అధిగమించి ఈ అరుదైన ఘనత సాధించినట్లు డీఆర్‌ఎం తెలిపారు. టికెట్ లేని ప్రయాణికులను అరికట్టడంలో సిబ్బంది నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. సీనియర్ డీసీఎం బి.ప్రశాంత్‌కుమార్ మార్గదర్శకంలో ఏసీఎం ఐఎస్‌ఆర్ మూర్తి సారథ్యంలో టికెట్ తనిఖీ బృందాలు కీలక స్టేషన్‌లు, పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో పటిష్టమైన తనిఖీలు, ఆకస్మిక తనిఖీలతో టికెట్ లేని ప్రయాణికులు, బుక్ చేయని లగేజీలకు జరిమానాలు విధించడం ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీల ద్వారా డివిజన్ రూ.76.34 కోట్లు ఆదాయం నమోదు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా కమర్షియల్ అధికారులు, సిబ్బందిని డీఆర్‌ఎం ప్రశంసించారు.


