వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్ మొక్కజొన్న పంట పరిశీలన రైతుకు అండగా ఉంటామని భరోసా
తోట్లవల్లూరు: మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పనలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని వల్లూరుపాలెంలో కృష్ణానది తీరాన ఉన్న సొసైటీ భూముల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంటను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. మద్దతు ధర, కొనుగోళ్లకు సంబంధించి పలువురు రైతులతో అనిల్‌కుమార్ మాట్లాడి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకున్నారు. గత ఏడాది క్వింటా మొక్కజొన్నకు రూ.2200కు పైగా ధర లభిస్తే నేడు రూ.1700 మాత్రమే దక్కుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.500 వరకు నష్టం వాటిల్లుతోందని, ఎకరాకు రూ.20 వేల వరకు నష్టం కలుగుతోందని రైతులు తమ గోడును చెప్పుకున్నారు. రైతులు పండించిన మొక్కజొన్న, మినుము పంటలకు గిట్టుబాటు ధరను కల్పించకుండా ప్రభుత్వం గాలికొదిలేసిందని అనిల్‌కుమార్ ఆరోపించారు. మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపటం సరికాదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు గ్రామగ్రామాన ఊదరకొట్టిన నాయకులు నేడు ఏమయ్యారని ప్రశ్నించారు. మొక్కజొన్నకు న్యాయబద్ధమైన మద్దతు ధర అందించి ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మినుము పండించిన రైతులకు కూడా సరైన మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంటలు దెబ్బతిన్న రైతులకు కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు గోడు పట్టని ఎమ్మెల్యే కుమార్ రాజా
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజాకు రైతుల గోడు ఏ మాత్రం పట్టటం లేదని అనిల్‌కుమార్ ఆరోపించారు. పండించిన పంటలకు మద్దతు ధర లేక మొక్కజొన్న, మినుము రైతులు ఇబ్బందులు పడుతున్నా, ఆయా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రాజా చొరవ చూపకపోవటం బాధాకరమన్నారు. ఆయనకు స్వప్రయోజనాలే తప్ప రైతుల సమస్యలు పట్టటం లేదన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతలపూడి గవాస్కర్ రాజు, నాయకులు మోర్ల రామచంద్రరావు, మైనేని తారాచంద్, తిరుమలశెట్టి వాసు, బడుగు శంకర్, ఈడ్పుగంటి రూబెన్, శీలం రమేష్, ఎంవీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


