ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిని, కృష్ణాతీరాన్ని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఇంజనీరింగ్, అభివృద్ధి పనులపై ఈవో శీనానాయక్ అధికారులు, ఎన్‌ఐఆర్‌ఎం, స్ఫాఅధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండపై అమ్మవారి దర్శనం మరింత సులభంగా, దివ్యంగా ఉండేలా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, దర్శనం అనంతరం కొండ దిగువకు చూస్తే పరవళ్లు తొక్కుతున్న పవిత్ర కృష్ణా నదీ సౌందర్యం భక్తుల మనస్సును పరవశింప చేసేలా మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందన్నారు. నదీ తీరంలో ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు కొండపై నుంచి వ్యూ పాయింట్లు, ధ్యాన కేంద్రాలను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్ఫా అందించే సహకారం, సమన్వయంతో ఇంద్రకీలాద్రిని మరింత సుందరంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చదిద్దాలని కోరారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఈ కోటేశ్వరరావు, ఎల్.రమాదేవి, డీఈ రవీంద్రనాధ్ ఠాగూర్, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.


