విస్సన్నపేట: మండలంలోని లంబాడీ తండా గ్రామ పంచాయతీ బాణావతు తండాకు చెందిన వడిత్యా రాజేష్( 26)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో ఉన్న ఎన్ఎీస్పీ కాలువలో మృతదేహం ద్విచక్రవానంతో పాటు పడిఉండటాన్ని బుధవారం ఉదయం గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి... రాజేష్ విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో క్రికెట్ గ్రౌండ్లో పని చేస్తుంటాడు. రోజూ లాగే మంగళవారం పనికి వెళ్లాడు. అయితే రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం ఉదయం కాలువలో ద్విచక్రవాహనంతో పాటు శవమై పడి ఉన్నాడని, రాజేష్‌ను ఎవరో చంపి కాలువ వద్ద మృతదేహాన్ని పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ వద్దకు మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు చేరుకుని ఆందోళన చేశారు. ఇదే తరుణంలో అటుగా వెళుతున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ కారును అడ్డగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ లక్ష్మీశ ఎస్ఐ అర్జున్ రాజుతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.


