అంతర్‌ రాష్ట్ర నేరస్తుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ రాష్ట్ర నేరస్తుల అరెస్టు

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

జల్సాల కోసం చోరీల బాట

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి బంగారం చోరీ చేసిన ఘటనల్లో ఇద్దరు నేరస్తులను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 216 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏడీసీపీ ఎం.రాజారావు ఈ కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కొండపల్లికి చెందిన ఇట్టా గోపీనాథ్‌ (25), దుంప రాంబాబు (25) మరో ఇద్దరితో కలిసి జిల్లాలోని ఆరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఎ.కొండూరు, గంపలగూడెం, ఇబ్రహీంపట్నంలో రెండు చోట్ల, తెలంగాణ రాష్ట్రం చందుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీల్లో రూ.32 లక్షల విలువైన 216 గ్రాముల బంగారం చోరీ చేశారు. విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతంలో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న గోపీనాథ్‌, రాంబాబును సీఐ కిషోర్‌బాబు అదుపులోకి తీసుకుని విచారించగా, వారు చేసిన నేరాలను అంగీకరించారు. వీరితో పాటు చోరీల్లో పాల్గొన్న ఇద్దరు పరారీలో ఉన్నారు.

216 గ్రాముల బంగారం స్వాధీనం

ఇట్టా గోపీనాథ్‌ పదో తరగతి వరకూ చదవి ఆ తర్వాత కొంతకాలం ఆటో నడిపి అనంతరం హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ దుంప రాంబాబు, దుంప సంపత్‌, చీమశెట్టి గోపికృష్ణ స్నేహితులయ్యారు. వారంతా మద్యం, పేకాట, కోడిపందేలు వంటి వ్యసనాలకు బానిసల య్యారు. డబ్బులు సరిపోక చోరీలు మొదలు పెట్టారు. రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడేవారు. గతంలో పలు కేసుల్లో అరెస్టయి జైలుకి వెళ్లొచ్చారు. నిందితులను అరెస్టు చేసి చోరీ సొమ్ము రికవరీ చేసిన సీసీఎస్‌ పోలీసులను పోలీస్‌ కమిషన్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement