ఘంటసాల: గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గాత్రం అజరామరమని కృష్ణాజిల్లా పర్యాటక శాఖ అధికారి గుండె రామ్‌లక్ష్మణ్ పేర్కొన్నారు. ఘంటసాల గ్రామంలో మధుర గాయకుడు వెంకటేశ్వరరావు నిర్వహించిన పాటల కచేరీకి 60 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఘంటసాల కళా సమితి ఆధ్వర్యంలో ఏడాది పాటు నిర్వహించే ఆరు దశాబ్దాల ఉత్సవాలను రామ్ లక్ష్మణ్ మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కళాసమితి అధ్యక్షుడు కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సభలో రామ్ లక్ష్మణ్ ప్రసంగించారు. తెలుగు పాటకు వన్నె తెచ్చిన ఘంటసాల కృష్ణాజిల్లా వాసి కావడం మన అదృష్టమన్నారు. ఆయనను చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహుదూర్ గండపెండేరంతో గౌరవించడం, గ్రామస్తులు అంబారీపై ఊరేగించడం విశేషమన్నారు. కృష్ణమోహన్ మాట్లాడుతూ.. ఘంటసాల వంశస్తుల అర్చకత్వం చేసిన శ్రీ జలదీశ్వరాలయంలో ఈ ఉత్సవాలను ప్రారంభించడం సంతోషకరమన్నారు. తొలుత ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాల చరిత్రతో కూడిన శ్రీ జలదీశ్వర స్వామి చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాళ్లూరి ఫణి హరిప్రసాద్, పీఏసీఏస్ చైర్మన్ బండి పరాత్పరరావు, వేమూరి గోపాలకృష్ణ, కొండపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు: పాత వస్తువుల సేకరణకు గ్రీన్షాప్లు ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ పేర్కొ న్నారు. గంగూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఆయన ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి గ్రీన్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గంగూరు గ్రామంలో మోడల్‌గా గ్రీన్షాప్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్తులు వారి వద్ద ఉన్న పాత వస్తువులు, ప్లాస్టిక్, ఇనుము, పేపర్, అట్టపెట్టెలు, స్టీల్, అల్యూమినియం, గాజు బాటిల్స్ ఉంటే గ్రీన్షాపునకు తీసుకు వచ్చి విక్రయించాలన్నారు. దీనికిగాను వస్తువుల విలువకు సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డాక్టర్ జె.అరుణ, కంకిపాడు ఎంపీపీ రాజ్యలక్ష్మి, గ్రామ ప్రత్యేకాధికారి ఓంకార్, ఎంపీడీవో శ్రీనివాసరావగు, టీడీపీ నాయకుడు కోయా ఆనంద్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


