గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కిడ్నీవ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో నీటి నాణ్యతపై నిర్వహించిన ఆడిట్ నివేదికలను బహిర్గతం చేయాలని, తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న మూత్ర పిండ వ్యాధుల సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ మంచినీటి సరఫరా సంస్థ (ఏపీడీడబ్ల్యూఎస్‌సీ) ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ టి.గాయత్రీదేవికి వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం సోమవారం వినతిపత్రం అందజేసింది. నీటి కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాణాపాయ స్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల్లో ఖనిజ లవణాలు, భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నందున, వెంటనే శుద్ధి చేసిన ఉపరితల జలాలను పైపుల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభావిత గ్రామాల్లోని అన్ని ఆర్వో ప్లాంట్లు రోజుకు 24 గంటలూ పని చేసేలా చూడాలని, సాంకేతిక కారణాలతో ప్లాంట్లు నిలిచిపోవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సదుపాయాలతో పాటు, వ్యాధి మూలా లను అరికట్టేందుకు శాసీ్త్రయమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరారు. స్వచ్ఛమైన తాగు నీరందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని, కలుషిత నీరు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాలరాయడమేనని అన్నారు. ఎ.కొండూరు, మార్కాపురం ప్రజల ప్రాణాలు కాపాడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తనుబుద్ధి శేఖర్‌రెడ్డి ఉన్నారు.
కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో నీటి నాణ్యతపై
ఆడిట్ నివేదికలు బహిర్గతం చేయాలి
ఏపీడీడబ్ల్యూఎస్‌సీకి వినతి పత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ బృందం


