అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం | - | Sakshi
Sakshi News home page

అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

పటమట(విజయవాడ తూర్పు): సీఎం చంద్రబాబు తన జన్మదినం సందర్భంగా పటమటలోని అన్న క్యాంటీన్‌లో సోమవారం సతీసమేతంగా అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు బయట భోజనం చేయాలంటే రూ.100 చెల్లించాల్సిన స్థితిలో రూ.5కే ప్రభుత్వం మంచి ఆహారాన్ని అందిస్తోందన్నారు. ఈ క్యాంటీన్లకు ఇస్కాన్‌ ఫౌండేషన్‌ రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేస్తోందని కొనియాడారు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణకు రూ.76 లక్షల విరాళాన్ని తన భార్య భువనేశ్వరి అందించి స్ఫూర్తిగా నిలిచారన్నారు. మీడియాతో సీఎం మాట్లాడుతుండగా ఆయన వెంట ఉన్న ఎన్‌ఎస్‌జీ కమాండో నందలాల్‌ షా ఎండవేడికి తట్టుకోలేక అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

యూపీహెచ్‌సీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాల్లోని యూపీహెచ్‌సీల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు సోమవారం మీ కోసంలో కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై. శ్రీనివాసరావు, పి. నాగరాజు, మచిలీపట్నం బ్రాంచి అధ్యక్షుడు బి. కోటేశ్వరరావు తదితరులు సమస్యలను వివరించారు. యూపీహెచ్‌సీల్లో పనిచేసిన కాలానికి (2016–2021) ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల నియామక నోటిఫికేషన్‌లో సర్వీస్‌ వెయిటేజ్‌ మార్కులు కలపాలని కోరారు. జీవో నంబర్‌ 301 ప్రకారం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా సర్వీస్‌ వెయిటేజ్‌ మార్కులు ఇవ్వమని ఉన్నప్పటికీ అధికారులు మార్క్స్‌ కలపకుండా ప్రభుత్వ ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నారని డీఆర్వో దృష్టికి తీసుకెళ్లారు.

ముగిసిన కొండపల్లి బొమ్మల పండుగ

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడు రోజులుగా జరుగుతున్న కొండపల్లి ఖిల్లా, కొండ పల్లి బొమ్మల పండుగ సోమవారం రాత్రి ముగిసింది. మూడురోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు బొమ్మల ప్రదర్శన, కళాకారుల ర్యాలీ ప్రదర్శనలతో పట్టణంలో ఉల్లాసాన్ని నింపాయి. ముంగిపు కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పూర్వం శ్రీ కృష్ణదేవరాయులు కాలంలో వీధుల్లో రత్నాలు రాసుల్లా పోసి అమ్మేవారని, నేడు కొండపల్లి బొమ్మలను రత్నాల్లా వీధుల్లో అమ్ముతున్నారని తెలిపారు. కొండపల్లి బొమ్మలు దేశానికి నిజ మైన వారసత్వ సంపద అన్నారు. కొండపల్లి బొమ్మల పోటీల్లో విజేతలుగా నిలిచిన శంకర్‌, గౌస్‌ బాషా, షేక్‌ ఖాజాకు వరుసగా రూ.30వేలు, రూ. 20వేలు, రూ. 10వేలను బహుమతులుగా అందజేశారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, కలెక్టర్‌ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.

అప్పు చేయడమే సంపద సృష్టా?

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా అంటూ జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ. 3.50లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర లేదు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు పూర్తిగా అటకెక్కాయని, తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారని కూటమి పాలకులను ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని జై భీమ్‌ భారత్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు కూడా నిండని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూడున్నర కోట్లు అప్పులు చేసిందని, ఇందుకు గల కారణాలను స్పష్టం చేయాలన్నారు. ప్రతి మంగళవారం అప్పులు తెస్తూ మంగళవారం ప్రభుత్వంగా కూటమి మిగిలిపోయిందన్నారు.

మావిగన్‌ ఓ మంచి ప్రతిపాదన

ప్రతిపక్షనేత చేసిన మావిగన్‌ ప్రతిపాదనను ఈ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని శ్రావణ్‌ డిమాండ్‌ చేశారు. అమరావతిలో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రజలు రావడానికి వీల్లేదా అని ప్రశ్నించారు. వాళ్లేమైన అంటరాని వాళ్లా అని నిలదీశారు.

Advertisement
 
Advertisement
Advertisement