డ్రోన్లు, రోబోల రూపకల్పన | - | Sakshi
Sakshi News home page

డ్రోన్లు, రోబోల రూపకల్పన

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

● ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన యువకుల కృషి ● గన్నవరం కేంద్రంగా లారా ఇన్నోవేషన్‌ సంస్థ ఏర్పాటు

గన్నవరం: ప్రభుత్వ ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఐదుగురు యువతీ యువకులు ఉన్నత ఉద్యోగ అవకాశాలను పక్కన పెట్టి స్వశక్తితో ఎదిగేందుకు గన్నవరం కేంద్రంగా లారా ఇన్నోవేషన్‌ సంస్థను ప్రారంభించారు. భారత రక్షణ రంగం, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా డ్రోన్లు, రోబోల డిజైన్ల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. స్థానిక రాయనగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని సోమవారం ఎండీ బి.చరణ్‌, సీఈఓ కె. మౌళీనాథ్‌ ప్రారంభించారు.

విద్యార్థి దశ నుంచే పరిశోధనలు..

ఈ సందర్భంగా సంస్థ ఎండీ చరణ్‌ మాట్లాడుతూ తామంతా శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లోనే ఇగ్నైటెడ్‌ మైండ్స్‌ ఆర్గనైజేషన్‌ను స్థాపించి సోషల్‌ సర్వీస్‌తో పాటు ప్రభుత్వ పాఠశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఆర్గనైజేషన్‌ ద్వారా పరిచయమైన తామంతా కలిసి గత రెండేళ్లుగా డ్రోన్ల ప్రొపెలర్లు, రోబోల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరిపినట్లు చెప్పారు. ఈ అనుభవంతో డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ హై ట్రస్ట్‌ డ్రోన్‌ ప్రొపెల్లర్స్‌, రోబోటిక్‌ రూపకల్పన ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు వివరించారు. భవిష్యత్‌లో భారత మిలటరీ, వ్యవసాయ రంగానికి అవసరమైన డ్రోన్‌ ప్రొపెల్లర్స్‌, రోబోటిక్‌ టెక్నాలజీని అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సంస్థ ప్రతినిధులు జి. ప్రసూన, జి. సంధ్య, పి. విష్ణువర్థన్‌, స్థానిక పారిశ్రామికవేత్త అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement