వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

ఉపాధి హామీ పథకంపై నీలినీడలు

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో పేద కార్మికులు రోడ్డున పడ్డారని.. ఉపాధి హామీ పథకంపై నీలినీడలు అలుముకున్నాయని వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక విజయవాడ సత్యనారాయణపురం భగత్‌సింగ్‌ రోడ్డులోని యూనియన్‌ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మార్చి, ‘జీరామ్‌ జీ’ పథకాన్ని తీసుకురావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. 2025–26 సంవత్సరానికి గానూ పనిదినాలు ఏకంగా 57.6 శాతానికి తగ్గించటం విచాకరమన్నారు. 2024–25లో 24.52 కోట్ల పనిదినాలు ఉంటే, ప్రస్తుత ఏడాదికి అవి 18.59 కోట్లకు పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పథకంలో రాజకీయం..

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి సుమారు 1,200 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, నిజమైన కార్మికులకు పని కల్పించకుండా, కేవలం అధికార పార్టీ సానుభూతిపరులకే డబ్బులు చెల్లిస్తున్నారని గౌతంరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో 80వేల మంది వికలాంగ కార్మికులకు లబ్ధి చేకూరగా, ప్రస్తుత ప్రభుత్వంలో ఆ సంఖ్య 66వేలకు పడిపోయిందని అన్నారు.

దర్శన టికెట్ల దందాపై సీఎంఓకి ఫిర్యాదు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో దర్శన టికెట్ల వ్యవహారం రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. గతంలో దర్శన టికెట్లను జిరాక్స్‌ కాపీలు తీసి అమ్మవారి దర్శనాలు చేయించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట దేవస్థాన ప్రోటోకాల్‌ దర్శనాలలో రూ. 500 టికెట్లను పదే పదే వినియోగిస్తున్న వ్యవహారం ఈవో దృష్టికి వచ్చింది. అయితే తాజాగా ఓ భక్తుడు తన స్నేహితులైన మరో ముగ్గురితో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. తనకు పరిచయం ఉన్న దేవస్థాన రిటైర్డ్‌ ఉద్యోగి సహకారంతో ప్రోటోకాల్‌ దర్శనం చేయించాలని కోరాడు. అయితే ఈ వ్యవహారంలో మధ్యవర్తులు సదరు భక్తుడి నుంచి రూ. వెయ్యి వసూలు చేశారు. ఆలయంలోని అవుట్‌సోర్స్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అటెండర్‌కు ఈ బాధ్యత అప్పగించారు. దర్శనం పూర్తయిన తర్వాత ఆ భక్తుడి నుంచి మరో వెయ్యి రూపాయలు ఫోన్‌పే చేయించుకున్నారు. దీంతో ఆగ్రహించిన సదరు భక్తుడు సీఎంఓలో పరిచయం ఉన్న వ్యక్తి సాయంతో ఈ వ్యవహారాలపై నేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలయ ఈవోను సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో కింది స్థాయిలో ఉన్న అటెండర్‌పై ఈవో వేటు వేసినట్లు సమాచారం. ఆలయంలో దర్శన టికెట్ల దందాలో కొంత మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ భాగస్వాములై ఉండటంతో ఇది కొనసాగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement