కలెక్టరేట్‌లో ప్రత్యేక భద్రత | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ప్రత్యేక భద్రత

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) సందర్భంగా సోమవారం భద్రత ఏర్పాట్లు చేశారు. గత వారం నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు తనకు పరిహారం అందలేదంటూ కలెక్టరేట్‌ ల్యాండ్‌ సెక్షన్‌లో కారం చల్లి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పీజీఆర్‌ఎస్‌ నిర్వహించే పింగళి వెంకయ్య సమావేశ మందిరం ప్రధాన ద్వారం వద్ద మెటల్‌ డిటెక్టర్‌ ఏర్పాటు చేశారు. మహిళలను తనిఖీలు చేసేందుకు కేబిన్‌ ఏర్పాటు చేశారు. పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. కలెక్టరేట్‌లోనూ అదనంగా పోలీసు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. గతంలో ఒకరిద్దరూ పోలీసు కానిస్టేబుళ్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను ఒక్కసారిగా పెంచేశారు.

సామాన్యులను తనిఖీ చేయడమా!

సీఎం, పీఎం వంటి నాయకుల సభలు, సమావేశాలు, ఇతర వీఐపీలు వచ్చిన సమయంలో తనిఖీలు చేసిన విధంగా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ ఎస్‌కు వచ్చే వారిని తనిఖీ చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా మెటల్‌ డిటెక్టర్‌ ఏర్పాటు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో వృద్ధురాలు కారం చల్లిందో.. ఆ పరిస్థితి తలెత్తకుండా చూస్తే సరిపోయేదని, అలా కాకుండా అర్జీలు సమర్పించేందుకు వచ్చే సామాన్యులను మెటల్‌ డిటెక్టర్‌ ద్వారా తనిఖీలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ప్రజా సమస్యలపై కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు పార్టీ నాయకులతో కలిసి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వేచ్ఛగా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి అర్జీ సమర్పించే అవకాశం ఉండాలని, ఏదో అనుకోని సంఘటన జరిగితే ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

మెటల్‌ డిటెక్టర్‌తో అర్జీదారులకు తనిఖీలు

Advertisement
 
Advertisement
Advertisement