మాదకద్రవ్యాలకు అలవాటుపడి చిత్తవుతున్న యువత మత్తులో నేరాలు, ఘోరాలు పోలీసులు నిర్వహిస్తున్న పరీక్షల్లో పదుల సంఖ్యలో డ్రగ్స్ బాధితులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన యువతే అధికం
ఇటీవల నమోదైన కేసులు..
పటమట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం 25 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అక్కడ బెట్టింగ్ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేయగా, 25 కేజీల గంజాయి దొరికింది.
విజయవాడ, మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఒక స్కూటర్ డిక్కీలో 2 కేజీల గంజాయిని ఇటీవల పోలీసులు పట్టుకున్నారు.
సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరునెలల కిందట ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు.
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కాచవరం గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన గల ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లోని ఖాళీ ప్రదేశంలో ఉన్న ముగ్గురు యువకుల నుంచి సుమారు 6 కేజీల గంజాయిని ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ నెల 4వ తేదీన స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు యువకుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నాడు.
మార్చి నెలలో కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల రోడ్‌లో చిన్నచిన్న గంజాయి పొట్లాలు కట్టి విక్రయిస్తున్న 9మందిని అదుపులోకి తీసుకొని 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మార్చి 10వ తేదీ తోట్లవల్లూరులో కారులో 26 ప్యాకెట్లలో 52 కేజీల గంజాయి దొరికింది.
జనవరి23న గన్నవరం మండలం చిన అవుటుపల్లి వద్ద 171.2 కేజీల గంజాయి దొరికింది.
మార్చి 26వ తేది పెనమలూరు మండలం కానూరులోని కల్పనా నగర్‌లో గంజాయి, డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. 10 కేజీల గంజాయిని అమ్మకానికి నలుగురు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరు వ్యక్తుల నుంచి 5కేజీల గంజాయి, ఒక గ్రామ్ ఎండీఎంఏను సీజ్ చేశారు.
ఏప్రిల్ 6వ తేదీ పెనమలూరులో ఇద్దరు గంజాయి విక్రేతల నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గల్లీ గల్లీలో
అదుపు చేయడంలో
ప్రభుత్వం విఫలం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మాదకద్రవ్యాలను (గంజాయి, డ్రగ్స్) సమూలంగా నిర్మూలిస్తాం.. ఉక్కుపాదం మోపుతాం.. అంటూ పాలకులు ఎక్కడ చూసినా మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే అవన్నీ ప్రచారం కోసం మాట్లాడే ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి, ఇతర డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు విజయవాడకే పరిమితమైన ఈ విష‘మత్తు’ ఇప్పుడు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. అక్కడ సైతం గంజాయికి బానిసలైన యువత ఉంటున్నారు. ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి కేజీల మొత్తంలో సరఫరా అవుతూనే ఉంది. అందుకు పోలీసులు పట్టుకున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గంజాయితో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ సైతం విజయవాడలో పట్టుపడటం ప్రజలు నివ్వెర పడేలా చేసింది. జాతీయ రహదారులు ఉండే పోలీసు స్టేషన్‌ల పరిధిలోనే ఎక్కువగా గంజాయి పట్టుబడుతోంది. ఇందులో మైనర్లు కూడా ఉండటం గమనార్హం.
మత్తులో యువత చిత్తు..
గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న వారిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన యువత ఉంటున్నారు. అందుకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పదుల సంఖ్యలో యువతకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కొండపల్లి తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే అనుమానంతో యువతకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 25 మందికి పాజిటివ్ వచ్చింది. జగ్గయ్యపేటలో నిర్వహించిన పరీక్షల్లో 31 మందికి పాజిటివ్ వచ్చింది. అంతేకాదు విజయవాడలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 15 మంది వరకూ పాజిటివ్ వచ్చింది.
మైకంలో నేరాలు..
గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువత ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన నిందితుడిని పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటు పడిన వారు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్‌లు చోరీ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో కూడా డ్రగ్స్‌కు బానిసలైన వారు ఉంటున్నారు. బెట్టింగ్స్‌కు పాల్పడే వారిలో సైతం డ్రగ్స్ బానిసలే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఏదైనా నేరంలో అరెస్టు చేసిన వారికి పోలీసులు తొలుత డ్రగ్ పరీక్షలు చేయిస్తున్నారు.
ఘోర వైఫల్యం..
జిల్లా స్థాయిలో డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో అవగాహన కార్యక్రమాలు, పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. వాటి అక్రమ రవాణా, విక్రయాలను అదుపు చేయడం, వాటి మూలాలను కూకటి వేళ్లతో పెకలించడంలో పూర్తిగా విఫలం చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే గంజాయి గ్రామాలను సైతం సరఫరా అవుతోందని ప్రజలు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా:
కృష్ణా జిల్లా:
గతేడాది డిసెంబర్ 26వ తేదీన పెద్ద అవుటుప ల్లి వద్ద 180 కేజీలు దొరికింది.


