విజయవాడలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ఆదివారం అక్షయ తృతీయ నేపథ్యంలో అందరూ బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే ఆ సంవత్సరమంతా మంచి ఆదాయముంటుందని ప్రజల నమ్మకం. ఆ విశ్వాసానికి అనుగుణంగా విభిన్న మోడల్స్, వివిధ ఆఫర్లతో జ్యూవెలరీ దుకాణదారులు వినియోగదారులను ఆకర్షించారు. దీంతో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివవచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. వేకువజామున నిర్వహించిన పలు ఆర్జిత సేవలతో పాటు ఉదయం 7గంటల తర్వాత ప్రారంభమయ్యే శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. వీఐపీలకు, ప్రముఖులతో పాటు రూ.300 టికెట్ కలిగిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఘాట్‌రోడ్డు, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ ప్రాంగణంలో చల్లటి తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లను దేవస్థానం అందజేసింది.
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ..
లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్యభగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా పలువురు ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
వాహనాల పార్కింగ్‌పై దృష్టి..
వేసవి సెలవుల నేపథ్యంలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో దేవస్థాన అధికారులు కొండపైకి అనుమతించే వాహనాల విషయంలో సెక్యూరిటీ, పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కుమ్మరిపాలెం నుంచి హెడ్ వాటర్ వర్క్స్ వరకు రోడ్డుకు ఇరువైపులా భక్తుల కార్లు, ఇతర వాహనాలను నిలుపుకొనేందుకు అనుమతినిచ్చారు. మరో వైపున కొండపైకి వచ్చే ద్విచక్ర వాహనాలను ఓం టర్నింగ్ వరకు మాత్రమే అనుమతించారు. వీఐపీల వాహనాలను ఓం టర్నింగ్ వద్ద నిలుపుదల చేసి బ్యాటరీ వాహనాలపై సమాచార కేంద్రానికి చేర్చారు. దీంతో కొంత మేర ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి. రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్ ఘాట్‌రోడ్డులోని చెప్పుల స్టాండ్, క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, చలివేంద్రాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సదుపాయాల కల్పనపై సూచనలు తీసుకున్నారు.


