కార్మిక వైద్యం.. నామమాత్రం! | - | Sakshi
Sakshi News home page

కార్మిక వైద్యం.. నామమాత్రం!

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

కార్మిక వైద్యం.. నామమాత్రం! షెడ్డుల్లో ఎన్నాళ్లీ ‘తాత్కాలిక’ సేవలు?

రెండేళ్ల క్రితం కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇప్పటికీ అమలు కానీ వైనం అప్పటి నుంచి తాత్కాలిక భవనాల్లోనే ఓపీ సేవలు ఆపరేషన్‌ థియేటర్‌లు లేక ఇబ్బందులు ప్రైవేటుకు సిఫార్సు చేస్తున్న వైద్యులు నాలుగు జిల్లాల్లో 5.8 లక్షల మంది ఈఎస్‌ఐ చందాదారులు

నాణ్యమైన వైద్యం అందించాలి..

షెడ్డుల్లో ఎన్నాళ్లీ ‘తాత్కాలిక’ సేవలు?

లబ్బీపేట(విజయవాడతూర్పు): గుణదలలో అధునాతన ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. రెండేళ్ల కిందట శిథిలమైన భవనాలను తొలగించారు. దీంతో తాత్కాలికంగా నిర్మించిన షెడ్డుల్లోనే ఓపీ సేవలు అందిస్తున్నారు. శిథిలమైన భవనాలు తొలగించిన స్థానంలో కొత్తగా అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మించాల్సి ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 5.80 లక్షల మంది ఈఎస్‌ఐ చందా దారులకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఏదైనా క్లిష్టతరమైన సమస్యతో వచ్చిన వారికి ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది.

5.80 లక్షల మందికి పెద్దదిక్కు..

విజయవాడలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి నాలుగు ఉమ్మడి జిల్లాలోని సుమారు 5.8లక్షల మంది చందాదారుల వైద్య సేవలకు పెద్దదిక్కుగా ఉంది. ఆయా జిల్లాలోని చందాదారులు డిస్పెన్సరీల నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. అత్యవసర వైద్యం అవసరమైన వాళ్లు నేరుగా వస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం రెండేళ్లుగా తాత్కాలిక భవనాల్లో అరకొర సౌకర్యాలతో నాణ్యమైన సేవలు అందని పరిస్థితి నెలకొంది. నిపుణులైన వైద్యులు ఉన్నా, తాత్కాలిక భవనాల్లో ఆపరేషన్‌ థియేటర్‌లలో సర్జికల్‌ పరికరాలు లేక పోవడంతో శస్త్ర చికిత్సలు నిర్వహించలేని దయనీయ స్థితి నెలకొంది. దీంతో ఈఎస్‌ఐ చందాదారులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

కలగానే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి..

విజయవాడలో ఐదు దశాబ్దాల కిందట ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. గతంలో ఏదైనా సూపర్‌స్పెషాలిటీ సేవలు అవసరమైతే హైదరాబాద్‌ వెళ్లేవారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. ఇక్కడే అత్యాధునిక సౌకర్యాలతో సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేస్తామని దశాబ్దం కిందట నాటి కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. అధునాతన వ్యాధి నిర్ధారణ పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఏదైనా సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయాలంటే ప్రైవేటుకు పంపుతున్నారు. దీంతో నడవలేని స్థితిలో ఉన్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

కార్మికులకు నాణ్యమైన వైద్యం కోసం ఈఎస్‌ఐ సౌకర్యం కావాలని పోరాటాలు చేసి సాధించుకున్న చందాదారులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 5.80 లక్షల మంది చందాదారులకు వైద్య సేవలు తాత్కాలిక భవనాల్లో అందించడం సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే అధునాతన భవనాలు నిర్మించి, వాటిలో సూపర్‌స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి తేవాలి.

– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం

Advertisement
 
Advertisement
Advertisement