లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలోని పలు వార్డులను ఆదివారం సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఆకస్మికంగా సందర్శించారు. సెలవు దినం రోజున తనిఖీలకు రావడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వార్డుల్లో ఉండాల్సిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోగులు, అటెండెంట్స్‌తో మాట్లాడారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. సెలవు రోజున కూడా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని, విధుల్లో అలసత్వం పనికిరాదని సూచించారు. వైద్యులు సైతం రౌండ్స్ వేయాలన్నారు. అదే సమయంలో రోగులకు పెడుతున్న డైట్‌ను పరిశీలించారు. ఆయన వెంట సివిల్‌సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ వై. పద్మావతి కూడా ఉన్నారు.
విజయవాడ కల్చరల్: శాంతి, సహనం, సౌభ్రాతృత్వం ప్రపంచానికి శ్రీ రామరక్ష అని సంగీత విద్వాంసుడు డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ అన్నారు. కంచికామకోటిపీఠం, లబ్బీపేట శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన 24గంటల నాదోపాసన మహాయజ్ఞం ఆదివారం ముగిసింది. లోకనాథ శర్మ మాట్లాడుతూ 40ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో సంగీత విద్వాంసుల సహకారంతో నాదోపాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ ఇన్‌చార్జి ఆర్. రామ్మోహనరావు ఆధ్వర్యంలో లోకనాథ శర్మను సత్కరించారు. నాదయజ్ఞంలో బెంగళూరు నుంచి వచ్చిన మున్నంగి(పరమాత్ముని) వెంకట రమ్య తోపాటు చిన్నారులు వై. యమున, ఎం. శేషుబాబు, వెంకట రఘువర్మ, ప్రసాద్, మల్లాది ఆహ్లాద్, ఆముక్త, తమన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో 870 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ వారిని నిర్వాహకులు పట్టించుకోకపోవడం గమనార్హం.
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం బందలాయి చెరువు గ్రామానికి చెందిన తుంగల తారక రామ సుమారు కిలో వెండితో చేసిన నాగపడగను ఆదివారం సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు స్వామివారి వెండి పడగను అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ వెస్ట్ బైపాస్‌లో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా ఏలూరు వైపు వెళ్లే వెస్ట్ బైపాస్ రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు ఆదివారం తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లే వాహనాలు గొల్లపూడి వై జంక్షన్, అట్కిన్సన్ స్కూల్ సెంటర్, ఊర్మిళా నగర్, కబేళా, సీవీఆర్ ఫ్లైఓవర్, పాముల కాలువ మార్గం మీదుగా వెస్ట్ బైపాస్ ఎక్కాలని సూచించారు. నగరంలోకి ప్రవేశించే వాహనదారులు సైతం ట్రాఫిక్ డైవర్షన్‌లను గమనించి ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని కోరారు. వాహనదారులు పోలీసుల సూచనలు, డైవర్షన్ బోర్డులను గమనించాలన్నారు.


