చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సెలవుపై వెళ్లారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు వ్యక్తిగత కారణాల నిమిత్తం సెలవు పెట్టారు. తిరిగి ఆయన ఈ నెల 27వ తేదీ సోమవారం విధులకు హాజరవుతారు. అప్పటి వరకు ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అన్నదాన పథకానికి హైదరాబాద్ మణికొండ అల్కాపురానికి చెందిన కేపీ ఆశ కుటుంబం రూ. 1,01,116, గుంటూరు కొత్తపేటకు చెందిన ఎం. సాంబశివరావు కుటుంబం రూ. 1,01,116, కాకినాడకు చెందిన వి. సూర్యనారాయణమూర్తి కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది. దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఆర్. వెంకటేష్, అరుంధతి దంపతులు రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.


