రెండో రోజు కొనసాగిన కొండపల్లి బొమ్మల పండుగ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల పండుగలో రెండోరోజు ఆదివారం వినూత్న రీతిలో కార్యక్రమాలు జరిగాయి. బొమ్మల ప్రదర్శన, బొమ్మల కొలువు, బొమ్మల దర్బార్ నిర్వహించా రు. బొమ్మల ఉత్పత్తి కళాకారులకు తెల్లపొనికి చెట్లు పెంపకం చేపట్టాల్సిన కార్యాచరణపై అటవీశాఖ ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, కళాకారులు జానపద, కూచిపూడి నృత్యాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మల ఆటలతో ఆకట్టుకున్నారు.
ఏటా నిర్వహించాలి..
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల పండుగ ఏటా నిర్వహించేలా చూస్తామన్నారు. హస్తకళల వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు మూడురోజుల పండుగ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వివిధ కళా రంగాలకు చెందిన కళాకారులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కోయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వివిధ వేషధారణలతో నృత్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి.


