గుడివాడరూరల్: మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్ ఇంట్లో జరిగిన చోరీ కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. గత నెల 14వ తేదీన మాజీ మంత్రి ఈశ్వర్‌కుమార్ సతీమణి మధురిమ హైదరాబాద్ వెళ్లి 18వ తేదీ తెల్లవారుజామున స్థానిక భయ్యావారివీధిలోని ఇంటికి తిరిగిచేరుకున్నారు. ఇంట్లో చోరీ జరిగిందని ఆమె గుర్తించారు. దొంగలు ఇంటి తాళం పగులకొట్టి బీరువాలోని వెండి వస్తువులను దొంగిలించినట్లు గుర్తించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ జె.ఆర్.కె.హనీష్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ఇంట్లో ఎటువంటి ఆధారాలు లభించకపోయినా సాంకేతిక పరిజ్ఞా నంతో సమాచారం సేకరించి, పాత నేరస్తుల కదలికపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలో ముగ్గురు వ్యక్తులను సీఐ అదుపులోకి తీసుకుని విచారించగా వారే చోరీ చేసులో నిందితులని తేలింది. వారి వద్ద రూ.15 లక్షలు విలువైన ఐదు కిలోల వెండి వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగ అయిన ఎన్టీఆర్ జిల్లా నందిగా టౌన్ రైతుపేట గ్రామానికి చెందిన దొడ్లోజి బాబు ఆలియాస్ రవిబాబు(56), అతనికి సహకరించిన రైతుపేట గ్రామానికి చెందిన తిరుమలశెట్టి అంజలి(38), గుడివాడ పట్టణం బేతవోలు సమీపంలోని నిమ్మతోటకు చెందిన తిరుమలశెట్టి వాణి(33)ని పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. రవిబాబు లారీ క్లీనర్‌గా పని చేస్తూ వ్యసనాలకు బానిసై జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. నిందితుడిపై హైదరాబాద్, ఎస్‌ఆర్‌నగర్, నెల్లూరు, చిలకలూరిపేట, తణుకు, ఎన్టీఆర్ జిల్లా తదితర ప్రాంతాల్లో 11 చోరీ కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ పాలా శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్
ఇంట్లో చోరీని ఛేదించిన పోలీసులు
ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
కేసు వివరాలు తెలిపిన
ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు


