మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిట్టూరు గ్రామానికి చెందిన జి. వెంకటరమణ, పార్వతీ దంపతులు సోమవారం రూ. 1,00,116 విరాళంగా సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
చల్లపల్లి: ఇటీవల చల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న పోలీసులను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మార్చి 31వ తేదీన పోలీస్ స్టేషన్‌లో మందుగుండు సామగ్రి తరలిస్తుండగా అట్టపెట్టెలో నుంచి ఉల్లి బాంబులు జారిపడి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదంలో ఎస్‌ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, ఎస్‌ఐ కార్ డ్రైవర్ డి.నాగరాజు తీవ్రంగా గాయపడగా వారిని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు హోమ్ మంత్రి అనితకు వివరించారు. అనంతరం ఆమె వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. విజయవాడ ఆచార్యరంగానగర్‌కు చెందిన జి.శరత్‌బాబు కుటుంబం సుమారు 22 గ్రాముల బంగారంతో తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలను ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై
కారు దగ్ధం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పోలీసు శాఖకు చెందిన ఒక కారు నుంచి మంటలు చెలరేగిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయం ఉండేది. అయితే ఆ కార్యాలయాన్ని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం అమరావతికి తరలించింది. దాంతో పాత కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వాహనాలను సైతం సిబ్బంది అమరావతికి తరలిస్తున్నారు. ఆ క్రమంలో అక్కడి నుంచి ఒక కారును అమరావతికి తరలిస్తుండగా కనకదుర్గ ఫ్‌లైఓవర్ పైన హెడ్ వాటర్ వర్క్స్ సమీపానికి వచ్చిన సమయంలో అందులో నుంచి మంటలు చెలరేగాయి. దాంతో అందులో ఉన్న డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపివేసి పక్కకు వచ్చేశాడు. అనంతరం అగ్నిమాపక శాఖకు, ఉన్నతాధికారులకు సమాచారమందించాడు. అగ్నిమాపక శాఖ వాహనం అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసింది.


