నీటి భద్రత.. సాగునీటి సంఘాల బాధ్యత | - | Sakshi
Sakshi News home page

నీటి భద్రత.. సాగునీటి సంఘాల బాధ్యత

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

నీటి భద్రత.. సాగునీటి సంఘాల బాధ్యత

విజయవాడ ఎంపీ శివనాథ్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నీటి వనరుల పరిరక్షణ, సమర్థ వినియోగం, భవిష్యత్‌ తరాలకు తగిన నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభమైన జలధార–నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా ముందడుగు వేద్దామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్‌, కలెక్టర్‌ లక్ష్మీశ.. అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఎంపీ శివనాథ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి దార్శనికతతో నీటి భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించారని.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పటిష్ట కార్యాచరణతో జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దామన్నారు. ఇప్పటికే జల భద్రతకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని పేర్కొన్నారు.

100 రోజుల ప్రత్యేక కార్యచరణ..

కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల కార్యక్రమం జరగనుందన్నారు. నీటి సంరక్షణ, భూగర్భ జల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టిసారించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సమీకృత నీటి నిర్వహణ, చెరువులు – కాలువల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం, నీటి సంరక్షణ విధానాలు, పచ్చదనం పెంపొందించడం, గ్రామ నీటి బడ్జెట్‌ లక్ష్యాలతో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వివరించారు. జిల్లా నీటి వనరుల అధికారి (డీడబ్ల్యూఆర్‌వో) పి.రామచంద్రరావు, ఈఈ రామకోటయ్య, డీఈ బాబురావు, జల వనరుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement