డ్రగ్స్‌ కేసులో దొరికితే జీవితం నరకమే | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసులో దొరికితే జీవితం నరకమే

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

డ్రగ్స్‌ కేసులో దొరికితే జీవితం నరకమే

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ వాంబేకాలనీలో డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 కార్యక్రమం

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): డ్రగ్స్‌పై దండయాత్ర అంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటున్నారని.. డ్రగ్స్‌ కేసులో దొరికితే సహించేది లేదని.. చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్‌ కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ హెచ్చరించారు. వాంబేకాలనీలోని వీఎంసీ కల్యాణమండపంలో ‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ కార్యక్రమం సోమవారం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జిల్లాలో డ్రగ్స్‌పై సైకిల్‌ యాత్ర మంచి ప్రభావం చూపిందన్నారు ఇప్పటి వరకు ప్రేమతో చెప్పాం.. బతిమాలి చెప్పి చూశాం.. ఇంకా మార్పు రాకపోతే ఈసారి తప్పకుండా దండించి తీరుతామన్నారు. డ్రగ్స్‌ మహమ్మారి ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా వారి కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్‌ రహిత జిల్లానే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందని.. అందుకే ప్రత్యేక కిట్లతో ఈ డ్రగ్స్‌ పరీక్షలను పోలీసులు, వైద్యుల సమక్షంలో జరుపుతున్నామన్నారు. డ్రగ్స్‌ తీసుకొని ఆరు నెలల సమయం గడిచినా కూడా ఈ పరీక్షల్లో కనిపిస్తుందని చెప్పారు.

149 హాట్‌ స్పాట్లు..

పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 149 హాట్‌ స్పాట్స్‌లను గుర్తించామని ఈ హాట్‌ స్పాట్స్‌లలో 30 రోజుల పాటు 3000 డ్రగ్స్‌ టెస్ట్‌ కిట్స్‌ ద్వారా రోజుకు 100 మంది చొప్పున డ్రగ్స్‌ టెస్ట్‌ చేస్తామన్నారు. స్వచ్ఛందంగా వచ్చి తనిఖీ చేసుకున్న వారిలో పాజిటివ్‌ వస్తే వారిని అడిక్షన్‌ సెంటర్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. డ్రగ్స్‌పై దండయాత్ర కరపత్రాలు, పోస్టర్‌లను ఆవిష్కరించారు. ప్రచార వాహనాలను జెండా ఊపి వారు ప్రారంభించారు. వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర, డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ శ్రీరామ్మూర్తి, డీఎంహెచ్‌ఓ సుహాసిని, డీసీపీలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement