● వివిధ ఆస్పత్రుల్లో 17 మందికి చికిత్స
● రోగులను పరామర్శించిన డీఎంహెచ్‌ఓ
లబ్బీపేట(విజయవాడతూర్పు): నందిగామ మండలం చందాపురంలో శనివారం సోకిన అతిసార అదుపులోకి వచ్చినట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ఆమె ఆదివారం అతిసార సోకిన చందాపురంతో పాటు, వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. చందాపురంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ఆదివారం స్వల్ప విరేచనాలతో ముగ్గురు రాగా, వారికి అవసరమైన చికిత్స అందించినట్లు తెలిపారు. కాగా 17 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆమె వివరించారు. వారిలో నందిగామ ఏరియా ఆస్పత్రిలో 10మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరుగురు, విజయవాడ జీజీహెచ్‌లో ఒకరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారికి అందుతున్న వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి..
ప్రజలు ఒకటి, రెండు సార్లకు మించి విరేచనాలు, వాంతులు అయితే వెంటనే వైద్య సిబ్బందికి తెలిపి సత్వర చికిత్స పొందాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కాకుండా, వేడి ఆహార పదార్థాలను తినాలని, క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు.
డోర్‌టు డోర్ సర్వే..
వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. అక్కడ సాధారణ పరిస్థితి వచ్చే వరకూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇంధుమతి, డాక్టర్ నవీన్, డాక్టర్ సునీల్, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


